Bonthu Rajeswara Rao: అధికార వైసీపీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో అవి బయటపడుతున్నాయి. దీంతో నేతలు పక్కచూపులు చూడడం ప్రారంభించారు. ప్రధానంగా జనసేన వైపు చూస్తున్నారు. దివంగత వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీ కీలక నేత బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరనున్నట్టు ప్రకటించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజేశ్వరరావు జగన్ వెంటే నడిచారు. 2014, 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. కానీ ఓటమి చవిచూశారు. అయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వ సలహదారుడిగా ఆయన పదవి దక్కించుకున్నారు. రాజోలు వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. అయితే రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన రాపాక వరప్రసాద్ గెలుపొందారు. ఎన్నికల అనంతరం ఆయన వైసీపీలో చేరారు. దీంతో పార్టీలో రాజేశ్వరరావు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. మరోవైపు పెదపాటి అమ్మాజీ రూపంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అధిష్టానం ప్రోత్సహించడంతో రాజేశ్వరరావు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

పవన్ ను కలిసిన బొంతు..
కొద్దిరోజుల కిందట రాజేశ్వరరావు జనసేన అధినేత పవన్ ను కలిశారు. పార్టీలో చేరేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే రాజోలు నియోజకవర్గం టిక్కెట్ ను ఓ మాజీ ఐఏస్ అధికారికి ఇవ్వడానికి పవన్ హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగింది. దీంతో బొంతు రాజేశ్వరరావు చేరిక సందిగ్ధతలో పడిందన్న ప్రచారం అంతటా నడిచింది. అయితే అనూహ్యంగా తాను జనసేనలో చేరనున్నట్టు రాజేశ్వరరావు గురువారం ప్రకటించారు. రాజోలు నియోజకవర్గంలో తన అభిమానులపై కేసులు పెడుతున్నా వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నియోజకవర్గం నుంచి అభిమానులు, పార్టీ శ్రేణులతో భారీగా జనసేనలో చేరుతామని ప్రకటించారు. రాజోలు జనసేనకు కంచుకోట అని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తానని రాజేశ్వరరావు తెలిపారు.

ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ గా…
బొంతు రాజేశ్వరరావు పార్టీలో సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఏపీలో ఆయన ఇరిగేషన్ ఇంజనీర్ చీఫ్ గా వ్యవహరించారు. నాడు దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి తలపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక భాగస్థులయ్యారు. అప్పటి నుంచి వైఎస్సార్ తో సన్నిహితంగా మెలిగేవారు. పదవీ విరమణ చేసి వైసీపీలో చేరారు. జగన్ తో కూడా సన్నిహిత సంబంధాలు నెరిపారు. అయితే వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో అధిష్టానం రాజేశ్వరరావును పక్కనపెట్టడం ప్రారంభించింది. అటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆగమనంతో పరిస్థితి మరింత నివురుగప్పిన నిప్పులా మారింది. బొంతు అనుచరులపై పోలీసు కేసులు కూడా పెట్టారు. అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో బొంతు జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాపాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది.