YCP – Janasena : ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. వైసీపీలో ఛాన్స్ దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇక తమకు పార్టీలో భవితవ్యం లేదనుకున్న వారు భవిష్యత్ ను వెతుక్కుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల మార్పుతో తాను కఠినంగా ఉంటానని జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఎప్పటినుంచో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు.. తమకు అవకాశం లేదని భావించి వేరే పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. అయితే టిడిపిలోకి వెళితే ప్రాధాన్యత దక్కదని భావిస్తున్నారు. జనసేన మంచి వేదిక అవుతుందని అంచనాకు వస్తున్నారు. అందుకే ఆ పార్టీలో చేరడానికి అన్ని విధాల సిద్ధం చేసుకుంటున్నారు.
తాజాగా విశాఖకు చెందిన వైసిపి ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈయన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రజారాజ్యంలో పనిచేసిన సమయంలోనే పవన్ కళ్యాణ్ తో పరిచయాలు ఉన్నాయి. పి ఆర్ పి కాంగ్రెస్ విలీనంతో ఆ పార్టీలో చేరారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధినేత టికెట్ ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వస్తే మేయర్ చేస్తానని హామీ ఇచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ.. వంశీకృష్ణ శ్రీనివాస్ మాత్రం మేయర్ కాలేకపోయారు. కార్పొరేటర్ గా పోటీ చేయించి.. మేయర్ విషయానికి వచ్చేసరికి మొండి చేయి చెప్పారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తరువాత ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ. ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 2024 ఎన్నికల్లో సైతం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించనని తేల్చి చెప్పేశారు. అప్పటినుంచి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. జనసేన అయితే మేలని భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన జనసేనలో చేరతారని తెలుస్తోంది. పవన్ తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణకు దిగుతారని సమాచారం. ఆయన చేరికతో విశాఖ నగరంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.