TDP And Jana Sena- YCP: ఒక్కొక్కరుగా రండి.. తేల్చుకుందాం నీ ప్రతాపమో.. నా ప్రతాపమో అన్న డైలాగు మాదిరిగా ఉంది వైసీపీ దుస్థితి. ఎన్నికలన్నాక వ్యూహంలో భాగంగా రాజకీయ పక్షాలు పొత్తు పెట్టుకుంటాయి. అది వారి ప్రాథమిక హక్కు. ఎన్నికలు జరిగినప్పుడు.. అప్పుడున్న పరిస్థితులను అనుసరించి పొత్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీ, జనసేనల మధ్య పొత్తుకు సానుకూల వాతావరణం ఉంది. ఇరు పార్టీలు నచ్చితేనే కలిసి పోటీచేస్తాయి. లేకుంటే ఎవరి దారిన వారే వెళతారు. అంతటి దానికి వైసీపీ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అనుకూల మీడియాలో నిత్యం ఆ రెండు పార్టీల పొత్తులపైనే కథనాలు వండి వారుస్తోంది. ఒకవైపు వైసీపీ నాయకులు పొత్తులతో రావడం కాదు.. విడివిడిగా ఒంటరిగా పోటీకి రండి అని సవాల్ విసురుతున్నారు. అటు అనుకూల మీడియా మాత్రం ఆ రెండు పార్టీల మధ్య కీచులాటకు ప్రయత్నిస్తోంది. స్థూలంగా చెప్పాలంటే వారికి ఆ రెండు పార్టీలు కలవడం ఇష్టం లేదు. దాని ఫలితమే ఈ ప్రయత్నాలన్నీ.

అయితే అదేసమయంలో టీడీపీ అనుకూల మీడియా సైతం అతి చేస్తోంది. టీడీపీ, జనసేన మధ్య ఉన్న సానుకూల వాతావరణాన్ని చెడగొడుతోంది. ప్రధానిని కలిసిన తరువాత పవన్ స్వరం మారిందని అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు రాస్తోంది. అయితే ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు అన్నాక సొంతంగా అధికారంలోకి రావాలని భావిస్తాయి. ఈ క్రమంలోనే పవన్ తనకు ఒక చాన్సివ్వాలని అడిగారు. అంతే కానీ పొత్తు ఉండదు కానీ.. ఉంటుందని కానీ చెప్పలేదు. గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని మాత్రమే చెప్పారు. అప్పుడు కూడా పొత్తులపై రకరకాల కథనాలు అల్లేశారు. మొన్నటికి మొన్న విశాఖ ఎపిసోడ్ లో పవన్ ను కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపితే అల్ మోస్ట్ ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందన్న రేంజ్ లో ప్రచారం కల్పించారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే టీడీపీ, జనసేన కలవడం వైసీపీకి ఇష్టం లేదు. ప్రస్తుతానికి బీజేపీ ఎటు మొగ్గుచూపుతుందన్నది తెలియడం లేదు. గత ఎన్నికల నుంచి జనసేన బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చింది. పవన్ ఆవేదనతో కూడిన హెచ్చరికలు బీజేపీ పెద్దలు వరకూ చేరాయి. అందుకే ప్రధాని పర్యటనలో పవన్ కు అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను పవన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వారి మధ్య జరిగింది స్వల్ప కాల సమావేశమే. అయినా దీనిపై నానా హైరానా పడుతున్న వైసీపీ,, ఎక్కడ టీడీపీ, జనసేన కలిసిపోతాయో.. తమ వెంట బీజేపీని తీసుకెళతాయో అని భయపడుతోంది. అందుకే ముందుగా టీడీపీ, జనసేనల మధ్య పుల్లలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అనుకూల మీడియాలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తయ్యేలా రెచ్చగొట్టే కథనాలను వండి వారుస్తోంది.