YCP- BJP: వైసిపి తీరు జాతీయస్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.బిజెపి ప్రాపకం కోసం వైసీపీ వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు దారితీస్తోంది. రాజకీయ ప్రయోజనాలు ఏ పార్టీకైనా సహజం. కానీ అది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. అసలు సాయమే అడగక పోయినా.. ఎదురెళ్లి సాయం చేస్తే దానిని ఏమంటారు. ముమ్మాటికి భయమే అంటారు. ఇప్పుడు వైసీపీ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. కేంద్రంలో అధికార బాధ్యతలు చేపడుతున్న బిజెపి అడగకుండానే వైసీపీ సాయం చేస్తోంది. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. పోనీ ఇలా సాయం చేసి రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడుకుంటున్నారా? అంటే అది లేదు.
బిజెపి అడుగుతుందా లేదా అని కనీసం ఆలోచించడం లేదు. నేను మద్దతిస్తాను సార్ అంటూ వైసీపీ చేతులెత్తేస్తుంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను తగ్గిస్తూ లెఫ్ట్నెంట్ గవర్నర్నే ప్రభుత్వంగా మార్చే బిల్లుకు వైసిపి ఏకపక్షంగా మద్దతు తెలపడం దేనికి సంకేతం. ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకమని.. బిజెపికి మద్దతు తెలపడాన్ని కూడా జాతీయస్థాయిలో వివిధ పార్టీలు తప్పుపడుతున్నాయి.
త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.అయితే దీని విషయంలో కూడా ఏకపక్షంగా కేంద్రానికి మద్దతు తెలుపుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ మాత్రం తనకు అలవాటైనా విద్య ప్రకారం మద్దతు తెలిపితే మూల్యం చెల్లించుకోవడం ఖాయం. వైసీపీకి ముస్లిం, మైనార్టీల మద్దతే కీలకం. ఒకవేళ కానీ బిజెపి ప్రాపకం కోసం ఆ బిల్లుకు మద్దతు తెలిపితే ముస్లింలు ఏకపక్షంగా వైసీపీకి దూరమవుతారు. అయితే ఈ విషయంలో మాత్రం జగన్ తన తెలివితేటలను ప్రదర్శిస్తారు. ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తానని చెబుతూనే కేంద్రం బిల్లుకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి.