Ippatam- YCP posters: ఇప్పటం..మొన్నటివరకూ ఈ గ్రామం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. గుంటూరు జిల్లాలోని ఓ గ్రామం. ఆ మండలం, చుట్టు పక్కల ప్రాంతాలకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. అసలు ఇప్పటం గ్రామ కథేమిటి? అని గుగుల్ లో వెతికులాట కూడా ప్రారంభమైంది. ఆ గ్రామం చుట్టూ రాజకీయాలేమిటి? పేరు మోసిన నాయకులు గ్రామంలో ఉన్నారా? అంటూ ఆరా తీయడం కూడా మొదలు పెట్టారు. తీరా అది పవన్ కళ్యాణ్ పుణ్యమే అని తెలుసుకుంటున్నారు. ఆ మధ్యన జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. కార్యక్రమ నిర్వహణకు ఉదారంగా ముందుకొచ్చిన గ్రామస్థులు తమ భూములను ఇచ్చారు. కానీ లోకల్ ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వ పెద్దల వరకూ బెదిరించినా వారు వినలేదు. అటు జనసేన ఆవిర్భావ సభ సైతం సక్సెస్ అయ్యింది. గ్రామస్థుల ధైర్యాన్నిఅభినందిస్తూ పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఆ మొత్తంతో గ్రామస్థులందరికీ పనికొచ్చేలా ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు. అయితే అంతటితో ఆ ఏపిసోడ్ ముగియలేదు. తమ మాట వినని ఇప్పటం గ్రామస్థులపై అధికార పార్టీ పెద్దలు ప్రతాపం చూపడం ప్రారంభించారు.

గ్రామంలో రోడ్డు విస్తరణ పేరిట ఒక పథకం రూపొందించారు. రోడ్డుకిరువైపులా ఆక్రమణలున్నాయని చెబుతూ యంత్రాలతో ధ్వంసం చేయడం ప్రారంభించారు. పదుల సంఖ్యలో ఇళ్లను తొలగించారు. గ్రామస్థులు కళ్లా వేళ్లా పడినా వినలేదు. పెద్దల గైడ్ లైన్స్ తో అధికారులు తొలగింపు పని పూర్తిచేశారు. తరువాత పవన్ రియాక్ట్ కావడం, అటు ప్రభుత్వ చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం, సోషల్ మీడియాలో జనాగ్రహం చూసిన వైసీపీ పెద్దల్లో కలవరం ప్రారంభమైంది. అసలు ఇప్పటంలో ఏమీ జరగలేదన్న కొత్త ప్రచారానికి నాంది పలికారు. గ్రామం అన్నాక రాజకీయాలుంటాయి. వేర్వేరు పార్టీల అభిమానులు ఉంటారు. అందుకే అక్కడ వైసీపీ సానుభూతిపరులతో సరికొత్త ‘జగన్’ నాటకానికి తెరతీశారు. ఇప్పటం గ్రామస్థులపై రాష్ట్ర ప్రజల సానుభూతి పెరుగుతుండడంతో సరికొత్త డ్రామా మొదలుపెట్టారు. అందులో పాత్రదారులు వైసీపీ వారే. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను మాత్రం వైసీపీ పెద్దలది.
తెగిపడిన గోడలు, కూల్చిన శ్లాబులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో కొందరు శిథిల ఇళ్లను వదిలి వేరేచోట తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ఇంటి పెద్దగా కొందరు అవతారమెత్తారు. శిథిల భవనాల సాక్షిగా ఇంటి వద్ద ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇప్పటం విధ్వంసం నేపథ్యంలో విపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో ‘మా ఇళ్లను ఎవరూ కూల్చలేదు. మీ ఎవ్వరి సానుభూతి మాకు అక్కర్లేదు. డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజయం చేయవద్దు’ అన్నదే ఫ్లెక్సీలో సారాంశం. తెగిపడిన ఇళ్లు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. యంత్రాల పోట్లు ఇంకా తడి ఆరలేదు. అయినా ఏం జరగలేదు. అదంతా రాజకీయ కుట్రగా పేర్కొంటున్నారంటే రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ క్రీడ ఆడుతున్నారో ఇట్టే అర్థమైపోతుందని విపక్ష నేతలు చెబుతున్నారు.

అయితే ఇది సాక్షి మీడియాకు అందివ్వడానికో.. లేక సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారానికి ఇలా చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇప్పటం అంటే జనసేన అన్న రేంజ్ లో గ్రామస్థులు ఓన్ చేసుకున్నారు. ఒకరిద్దరు వైసీపీ సానుభూతిపరులతో కొత్త రాజకీయ డ్రామా మొదలు పెట్టారు. ఇప్పటివరకూ వైసీపీ సానుభూతిపరుల ఇళ్లవరకే కనిపించిన ఫ్లెక్సీలు అందరి ఇళ్లపైనా కట్టడం మొదలు పెట్టారు. కట్టకుంటే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తాం. రేషన్ నిలిపివేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో కొందరు మెత్తబడుతున్నారు. మరికొందరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని నిట్టూరుస్తున్నారు. భయపెట్టి రాజకీయాలు చేయగలరు. కానీ లోలోపల మా మనసులో ఉన్న పవన్ ను దూరం చేయలేరంటూ గ్రామస్థులు చెబుతున్నారు.