Pawan Kalyan- YCP: ప్రభుత్వ చర్యలను విమర్శించిన ప్రతిసారి పవన్ పై వైసీపీ మంత్రులు, నాయకులు ఎదురుదాడి చేస్తుంటారు. ఆయన వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేస్తుంటారు. ఒకరిద్దరు కుటుంబసభ్యులపై తిట్లదండకానికి దిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే తాను విధానపరంగా మాట్లాడుతున్నానని.. వ్యక్తిగత కామెంట్లు చేయవద్దని.. అలాచేస్తే తానుకూడా దిగవలసి వస్తుందని పవన్ కూడా హెచ్చరించారు. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులు ఎంత దిగజారుడు ఆరోపణలు చేస్తున్నా సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చారే తప్ప… ఏ నాడూ బ్లాస్ట్ అయిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు ఏకంగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని ..మూడు రాజధానులతో ముడిపెట్టడం మాత్రం విమర్శలపాలవుతోంది. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోనిది లేనిది.. మూడు రాజధానుల వద్దా? అంటూ కొత్త వాదనకు ఇప్పుడు తెరపైకి తెచ్చారు. అయితే వైసీపీ శృతిమించి వ్యవహరిస్తోందని.. దిగజారుడు రాజకీయాలు చేస్తోందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.

రాజకీయాల్లో ఉన్నవారు నైతిక విలువలు, కుటుంబ విలువలు పాటించాల్సిందే. ఇందులో కాదనడానికి ఏమీ లేదు. కానీ పవన్ ను మాత్రం పదే పదే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా టార్గెట్ చేయడం మాత్రం బాధాకరం. ప్రస్తుతం పవన్ సతీమణులు, మాజీ భార్యలు ఎవరూ రాజకీయాల్లో లేరు తమను పవన్ అన్యాయం చేశాడని.. ఆదరించడం లేదని ఎవరూ ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా లేవు. చట్టపరంగా ఇరువురి అంగీకారంతో విడిపోవడాలు, పెళ్లిళ్లు జరిగి ఉంటాయి. దీనిపై అటు పవన్ కానీ.. అటు అయన సతీమణులు కానీ స్పష్టత ఇవ్వలేదు. అలాగని ఒకరికొకరు ఆక్షేపించుకున్న సందర్భాలు లేవు.అటు రెండో భార్య రేణుదేశాయ్ కూడా చాలా సందర్భాల్లో మీడియా ముందుకొచ్చారు. కానీ ఎప్పుడు పవన్ తమను అన్యాయం చేశారన్న మాట ఆమె నుంచి వినిపంచనూ లేదు. అయితే భార్యలకు లేనిది వైసీపీ నేతలకు ఎందుకొచ్చిందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.

పవన్ క్లీన్ ఇమేజ్ పై రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటివరకూ ఆయన పవర్ పాలిటిక్స్ చేయలేదు. నీతిగా, నిజాయితీగా సినిమాలు చేసుకొని సంపాదించారు. అలా వచ్చిన సంపాదనతోనే అటు కుటుంబాలను, ఇటు పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చేయడానికి విమర్శలంటూ ఏమీ లేవు. దత్తపుత్రుడు, ప్యాకేజీ నాయకుడంటూ ఆరోపణలు చేస్తున్నా పవన్ వెరడం లేదు. అటు ప్రజలు కూడా పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు వ్యక్తిగత హననానికి దిగుతున్నారు. బహు భార్యత్వాన్ని పదే పదే తెరపైకి తెస్తున్నారు. సాక్షాత్ సీఎం జగనే పలు సందర్భాల్లో బహు భార్యల అంశాన్ని ప్రస్తావించిన సందర్భాలున్నాయి. ఆ ఆరోపణలనే ఇప్పడు వైసీపీ నేతలు కూడా అనుసరిస్తున్నారు. మూడు రాజధానులను తీసుకొని ఏకంగా ముగ్గురు భార్యలతో పోల్చి తమ బేలతనాన్ని చూపించుకున్నారు. అయితే ఈ వ్యక్తిగత విమర్శలను ఇలానే వదిలేస్తే.. రేపు వైసీపీ నేతలు సైతం బాధితులుగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.