Times Now Survey -YCP: వైసీపీనే గెలుస్తుందట.. టైమ్స్ నౌ భజన మామూలుగా లేదుగా..

తాజాగా టైమ్స్ నౌ సంస్థ వెల్లడించిన ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీలకు అనుకూలంగా ఈ ఫలితాలు ఉండడం విశేషం. దీంతో అధికారానికి దాసోహమయ్యారంటూ సంబంధిత సర్వే సంస్థలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Written By: Dharma, Updated On : August 17, 2023 5:21 pm
Follow us on

Times Now Survey -YCP: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది? దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. అటు అధికార ఎన్డీఏ.. ఇటు విపక్ష ఇండియా కూటమి వ్యూహాలు పన్నుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. దీనిని ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పేరిట మీడియా సంస్థలు హడావిడి చేస్తున్నాయి. అయితే అవి ప్రకటిస్తున్న ఫలితాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అందులో వాస్తవం ఎంత అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

తాజాగా టైమ్స్ నౌ సంస్థ వెల్లడించిన ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీలకు అనుకూలంగా ఈ ఫలితాలు ఉండడం విశేషం. దీంతో అధికారానికి దాసోహమయ్యారంటూ సంబంధిత సర్వే సంస్థలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత బాగా పరిపాలించినా ప్రభుత్వానికైనా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇప్పటికే కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. బిజెపిపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి అవతరిస్తుందని తాజా సర్వే వెల్లడించింది. ఈ సర్వే చెబుతున్నట్లు బిజెపి 300 లోక్సభ సీట్లు దక్కించుకోవడం కత్తి మీద సామే. ఈ విషయం స్వయంగా బిజెపి నేతలే చెబుతున్నారు. ఎన్డీఏ అధికారంలోకి రావచ్చు కానీ.. సంకీర్ణ ప్రభుత్వం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షాల సాయంతో మాత్రమే బిజెపి అధికారంలోకి రాగలదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏపీలో సైతం టైమ్స్ నౌ ఏకపక్ష ఫలితాలను వెల్లడించింది. వైసిపి క్లీన్ స్వీప్ చేస్తోందని చెప్పుకొచ్చింది. 25 లోకసభ స్థానాలకు గాను.. అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్పడం మరింత కామెడీగా మారింది.

అయితే ఈ సర్వే నిబద్దతపై అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ప్రశ్నిస్తే దాడులు, వైసీపీ నేతల అక్రమాలు, అప్పులు పుడితే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, ఇటు చుట్టుముడుతున్న కేసులు, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇన్ని వైఫల్యాల నడుమ ఆ స్థాయి మెజారిటీ సాధ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో జగన్ హవా అంటే.. ఆ సర్వేకి ఏమాత్రం ప్రామాణిక ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.

వాస్తవానికి ఏపీలో అధికార వైసీపీకి సానుకూల ఫలితాలు ఇవ్వడం వెనుక.. టైమ్స్ నౌ సంస్థకు పెద్ద టాస్కే ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సర్కార్ కొద్ది రోజుల కిందట బెన్నెట్ కోల్ మన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇది టైమ్స్ గ్రూపునకు చెందినది. ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు.. ప్రభుత్వము, సీఎం జగన్ ఇమేజ్ పెంచేందుకు కుదుర్చుకున్న డీల్ ఇది. ఎన్నికల సమయంలో సర్వేల పేరిట అనుకూల ఫలితాలు ఇవ్వడానికి రహస్య ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దానికి అనుగుణంగానే టైమ్స్ నౌ సంస్థ వరుసగా చేపట్టిన సర్వే పలితాలలో.. వైసీపీకి ఏకపక్ష ఫలితాలను కట్టబెడుతోంది. అందుకే విపక్షాలు సైతం దీనిని లైట్ తీసుకుంటున్నాయి. ఈ సర్వే ఫలితాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు.