TTD
TTD: టీటీడీ ప్రకటించిన ఊత కర్ర సోషల్ మీడియాలో ఒక జోక్ గా మారింది. తెగ వైరల్ అవుతోంది. అసలు మనిషికి ఓ కర్ర సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీన్ని అమలు చేయాలంటే వేలాది కర్రలు కావాలి. వాటికోసం అడవుల పైనే పడాలి. కాలినడక మార్గంలో ఇచ్చే కర్రలను కొండమీద కలెక్ట్ చేసుకోవాలి. అవే కర్రలను తిరిగి కొండ దిగువకి తేవాలి. ఇదో నిరంతర ప్రక్రియ గా మారాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇది కర్ర మీద సామే. అందుకే సోషల్ మీడియాలో ఈ నిర్ణయం పై రకరకాల సెటైర్లు పడుతున్నాయి.
సోషల్ మీడియాలో ఓ పోస్టు తెగ ఆకట్టుకుంటుంది. ” చిరుతతో కర్ర సాము చేసి గెలవడానికి అలిపిరి వద్ద ఉచిత శిక్షణ తరగతులు ఆగస్టు 20 నుంచి ప్రారంభం. ఆసక్తి కలిగిన వారు చిరుత పులిని వెంట తెచ్చుకోవాలి. కర్ర ఉచితం. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రార్థన” అంటూ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. టీటీడీ తాజా ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్న వారు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
మరికొందరైతే టీటీడీకి వచ్చే ఆదాయంతో నడక మార్గాన్ని ఇలా కూడా రూపొందించుకోవచ్చని సలహాలిస్తున్నారు. రకరకాల ఇనుప గేట్లతో కూడిన మార్గాలను, వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ పాలకవర్గం, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భక్తులకు కర్రలు కాకుండా తుపాకులు ఇవ్వాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై మండిపడుతున్నారు. వారికి ఏమాత్రం సమాజం పై బాధ్యత లేదని తేల్చేస్తున్నారు. వీటిని రాజకీయ వ్యాఖ్యలుగా కొట్టి పారేస్తున్నారు. రాజకీయాల కోసం అవహేళన చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే టీటీడీ ఊతకర్రల నిర్ణయం సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.