Y S Sharmila: టమాట కూర అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ… రోజూ అదే కూర వండితే మొహం మొత్తుతుంది. ఒకటే పని అదే పనిగా చేస్తే చేసే వాళ్లకు ఇబ్బంది లేకుండా… చూసేవాళ్లకు ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఆంధ్రా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. మొదట్లో దీనిని అంతగా సీరియస్ గా పట్టించుకోని టిఆర్ఎస్ నేతలు.. తర్వాత ఫైర్ అవుతున్నారు. అంతేకాదు నర్సంపేట లో జరిగిన యాత్రలో నానా రచ్చ చేశారు.. మరుసటి రోజు ఆమె ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తే పోలీసులు కారులో ఉండగానే ఆమెను బలవంతంగా తరలించారు. ఈ ఎపిసోడ్లతో ఆమెకు ఎక్కడ లేని మైలేజ్ వచ్చింది. ఒక సెక్షన్ మీడియా ఆమెకు విపరీతమైన కవరేజ్ ఇచ్చింది. దీనికి తోడు టిఆర్ఎస్ నాయకులు వరుస ప్రెస్ మీట్ లలో ఆమెను కడిగి పారేశారు. కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న ఆమె.. మళ్లీ దీక్షలకు దిగారు.

అప్పుడు కూడా అలాగే..
అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారించి, చంచల్ గూడ జైలుకు పంపించినప్పుడు షర్మిల ఇదే తీరున పాదయాత్ర చేశారు.. అప్పట్లో తన అన్న సొంత మీడియా ఆమెకు విపరీతమైన కవరేజ్ ఇచ్చింది.. తన అవసరం కనుక జగన్ కూడా ఆమె పాదయాత్రకు అన్ని సర్దుబాటు చేశాడు. ఇందులో వైయస్ విజయలక్ష్మి కూడా పాలుపంచుకోవడంతో యాత్ర బాగా రక్తి కట్టింది.. సీన్ కట్ చేస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ షర్మిల తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చారు.
తెలంగాణలో సొంత కుంపటి
అన్నతో భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయిన తర్వాత షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారు. తన భర్త అనిల్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో, తాను కూడా తెలంగాణ కోడలినని చెప్పుకొచ్చారు. తనను ఆదరించాలని పాదయాత్ర షురూ చేశారు. రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.. పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఆమె టిఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా పెట్టుకున్నారు.. నేరుగా వారిపై విమర్శలు చేస్తున్నారు.

రొటీన్ యాత్ర
ముందే చెప్పుకున్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. కొన్నిచోట్ల నిరసన దీక్షలు చేశారు.. అయితే అప్పట్లో ఇవి సక్సెస్ అయ్యాయి.. తెలంగాణలో కూడా ఇదే ఫార్ములా ప్రయోగిస్తుండడంతో జనాల్లో అంత ఇంట్రెస్ట్ ఉండడం లేదు.. పైగా తెలంగాణ ఏర్పాటును అడుగడుగున అడ్డుకున్న రాజశేఖర్ రెడ్డి పేరుతో ఆమె సంక్షేమ రాజ్యం తెస్తామని చెప్పడం జనాలకు అంతగా ఎక్కడం లేదు. కానీ ఇవేవీ ఆమె పట్టించుకోవడం లేదు. యాత్రల పేరుతో తెలంగాణ మొత్తం చుట్టి వస్తున్నారు. అయితే నర్సంపేటలో జరిగిన గొడవ కారణంగా ఈ యాత్ర చేసేందుకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే ఆమె హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక 20 మందితో ధర్నాకు కూర్చున్నారు. పోలీసులు వచ్చి ఆమెను అధువులకు తీసుకొని ఇంటి దగ్గర విడిచిపెట్టారు.. షర్మిల ఇంట్లోకి వెళ్లకుండా రోడ్డుపైన ధర్నా చేశారు.. దీంతో పోలీసులు ఆమెను ఇంట్లో దింపి వెళ్లారు.
కోర్టుకు వెళ్లొచ్చు కదా
తెలంగాణ ప్రజలపై అంత ప్రేమే ఉంటే, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అనిపిస్తే దీక్ష చేయవచ్చు.. ఆ దీక్షకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి తెచ్చుకోవచ్చు.. ప్రస్తుతం బండి సంజయ్ అదే చేస్తున్నాడు.. కానీ దురదృష్టవశాత్తు షర్మిల ఇవేమీ పాటించకుండా ధర్నాలు, దీక్షలు చేస్తుండడం జనాలకు అంతగా ఎక్కడం లేదు. ఇందులో వైయస్ విజయలక్ష్మి కారులో ఉండి దీక్ష చేయడం ఏమిటో అంతు పట్టకుండా ఉంది. కాగా గతంలో తల్లి తనయలు దీక్షలు చేసినప్పుడు కొద్ది గొప్పో జనాల్లో సానుభూతి ఉండేది.. కానీ ఇప్పుడు అది పూర్తిగా పోయింది. అందుకే షర్మిలక్కా.. ఈ రొటీన్ దీక్షలు వద్దు గాని.. కొత్తగా ఏమైనా ట్రై చెయ్.