Telangana: ప్రేమించిన యువతికి వేరే వారితో వివాహం చేయడానికి కుటుంబసభ్యులు సిద్ధమవుతారు. తీరా పెళ్లి పీటలు దాకా వచ్చేసరికి ప్రియుడు రియాక్టవుతాడు. ప్రేమించిన యువతిని పెళ్లి మండపం నుంచి తీసుకెళతాడు. ఈ దృశ్యాలు ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తుంటాయి. అచ్చం ఇటువంటి సీనే హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడలో కలకలం సృష్టించింది. అయితే ఈసారి ప్రేమికుడు హీరో తరహాలో రాలేదు. అచ్చం విలన్ మాదిరిగా వంద మంది బృందాన్ని వెంటబెట్టుకొచ్చి యువతి కుటుంబసభ్యులను చితకబాది తీసుకెళ్లిపోయాడు. అయితే ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులు కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతిని సేఫ్ గా కుటుంబసభ్యులకు అప్పగించారు. కానీ ప్రధాన నిందితుడి అరెస్ట్ ను చూపకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి మిస్టర్ టీ వ్యవస్థాపకుడు. దేశంలో 400 ఫ్రాంచైజీలను సక్సెస్ ఫుల్ రన్ చేస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త కావడం గమనార్హం.

నాగర్ కర్నూలు జిల్లా ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్ రెడ్డి సైన్యంలో పనిచేసి రిటైరయ్యారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో కుటుంబంతో స్థిరపడ్డారు. కుమార్తె నగరంలో బీడీఎస్ చదువుతోంది. ఆమెకు నవీన్ రెడ్డితో 2021లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. దీంతో ఇరు కుటుంబాలు కూడా వారి ప్రేమను సమ్మతించాయి. వివాహం జరిపించడానికి నిర్ణయించాయి. అయితే ఈ నేపథ్యంలో కుటుంబాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి నవీన్ రెడ్డిని యువతి దూరం పెట్టింది. అయినా నవీన్ రెడ్డి ఆమెను విడిచిపెట్టలేదు. వాట్సాప్ లో మెసేజ్ లు పంపేవాడు. దీంతో బాధితులను పోలీసులను ఆశ్రయించగా.. నవీన్ రెడ్డిపై పోలీసులు కేసు కూడా నమోదుచేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన నవీన్ ఆ యువతి ఇంటి సమీపంలో ప్లాట్ ను అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి వెంటపడడం ప్రారంభించాడు. తనను కాదంటే ఎవరికీ దక్కనివ్వనని కూడా హెచ్చరించేవాడు.
ఈ నేపథ్యంలో యువతికి వేరే వ్యక్తితో వివాహానికి కుటుంబసభ్యులు నిర్ణయించారు. శుక్రవారం నిశ్చితార్థానికి ముహూర్తంగా నిర్ణయించారు. అయితే ఉదయం 11 గంటల సమయంలో పదుల సంఖ్యలో వాహనాలతో వచ్చిన నవీన్ అక్కడ భయానక వాతావరణం సృష్టించాడు. యువతి తండ్రితో పాటు కుటుంబసభ్యులను, బంధువులను కొట్టి మరీ యువతిని తన వెంట తీసుకెళ్లిపోయాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కానీ సరిగ్గా రెస్పాండ్ కాకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను ట్రేస్ అవుట్ చేశారు. యువతిని కాపాడారు. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కానీ ప్రధాన నిందితుడు నవీన్ మాత్రం పరారీలో ఉన్నాడు. అయితే పోలీసులపై బాధిత కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. నవీన్ కు పొలిటికల్ లీడర్స్ తో ఉన్న సంబంధాలు దృష్ట్యా కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన నవీన్ విజయవాడలో సీఏ ఇంటర్ పూర్తిచేశాడు. తరువాత వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. మిస్టర్ టీ స్థాపించి.. దేశ వ్యాప్తంగా విస్తరించాడు. ఆయన తండ్రి సాధారణ రైతు. గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉండేది. ఇటీవలే తల్లిదండ్రులను తన వద్దకు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడే ఒకట్విస్ట్. సదరు యువతితో తనకు వివాహమైందని నవీన్ చెబుతున్నాడు.గత ఏడాది ఆగస్టు 4న ఏపీలోని బాపట్ల జిల్లా వలపర్ల గ్రామంలో వివాహం చేసుకున్నానని..తన కొత్తకారుకు ఆమె నామినీగా ఉన్నట్టు చెబుతున్నాడు. తన కుమార్తె బీడీఎస్ పూర్తిచేసిన వరకూ వివాహం చేసుకున్నట్టు బయటకు చెప్పొద్దని తల్లిదండ్రులు కోరారని.. కానీ ఆమె మనసు మార్చి వేరొకరితో పెళ్లిచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నవీన్ రంగారెడ్డి కోర్టులో కేసు వేశాడు. కోర్టు ద్వారానే పోలీసులతో పాటు ఆమె కుటుంబసభ్యులకు నోటీసులు పంపాడు. అయితే ఇవేవీ పట్టించుకోని కుటుంబసభ్యులు యువతికి పెళ్లి చేయడానికి నిశ్చయించడంతో నవీన్ మనుషులతో వచ్చి బీభత్సం సృష్టించాడు.