Women: భూత వైద్యం మాయలో పడి ఓ అమాయక మహిళ బలైంది. ఆరోగ్యం బాగు చేస్తానని నమ్మించి అత్యాచారం చేయబోయాడు ఆ భూత వైద్యుడు. దీంతో ప్రతిఘటించిన ఆమెను పైశాచికంగా హత్య చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నా ఈ మూఢ నమ్మకాల బారిన పడి చాలా మంది సమిధలవుతున్నారు. తమ శారీరక వాంఛలు తీర్చుకునే క్రమంలో మహిళలను బలిపశువులుగా చేసుకుని కామం తీర్చుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇలా దారుణాలు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి అలియాస్ విజయ వ్యవసాయ కూలీ మేస్రీగా పనిచేస్తోంది. సోమవారం వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలు అవసరమై ఆదివారం రాత్రి వడ్డె పాలెం వెళ్లి కూలీలను పిలుస్తోంది. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య అనే భూతవైద్యుడు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించాడు. ఆమెతో మాటలు కలిపి నీ మోకాళ్ల నొప్పులు బాగు చేస్తానని నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లాడు.
మోకాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో విషయం తెలిస్తే తనకు ప్రమాదమని భావించి ఆమెను కాళ్లు చేతులు కట్టేసి గొడ్డలితో నరికాడు. విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లే ప్రయత్నంలో కామేపల్లి గ్రామస్తులు ఒక్కసారిగా ఓబయ్యపై దాడి చేసి కర్రలతో కొట్టారు. దీంతో దెబ్బలకు తాళలేక ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకోబోయిన ఎస్సై రజియా సుల్తానాపై కూడా గ్రామస్తులు దాడి చేశారు.
అయితే ఈ హత్య వెనుక క్షుద్రపూజలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హతురాలు శరీరంపై చాతీభాగంలో దుస్తులు లేకపోవడం చూస్తుంటే అత్యాచార యత్నం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఓబయ్యపై దాడి చేసింది ఎవరెవరనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో గ్రామంలో రెండు హత్యలు చర్చనీయాంశంగా మారాయి.