Woman police officer: పోలీసులపై పేకాట రాయుళ్లు దాడి చేశారు. ఆపై బంధించారు. అందులో ఓ మహిళా అధికారిణి కూడా ఉన్నారు. ఒడిశాలో వెలుగు చూసింది ఈ ఘటన. బాలాసోర్ జిల్లాలో పేకాట స్థావరంపై దాడి చేసిన ఓ మహిళా పోలీస్ అధికారిని పేకాటరాయళ్లు తీవ్రంగా గాయపరిచారు. ఆమె వెంట వచ్చిన ముగ్గురు సిబ్బందితో సహా గదిలో బంధించారు. చివరకు ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో వారు వెళ్లి కాపాడారు.
బాలాసోర్ జిల్లా తలసరి మెరైన్ పోలీస్ స్టేషన్ లో చంపబాటి సోరన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఆమె వెంట ముగ్గురు సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు. సమీపంలోని ఉదయపూర్ గ్రామంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. అక్కడ పేకాట ఆడుతున్న వారు పోలీసులపై తిరగబడ్డారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆమెతో పాటు ముగ్గురు సిబ్బందిని ఓ గదిలో బంధించారు.
అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. వారిని విడిపించారు. ఈ ఘటనకు సంబంధించి 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జలేశ్వర్ దిలీప్ సాహూ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ఘటన ఒడిస్సాలో సంచలనం సృష్టించింది.