Woman Commandos: చతిస్గడ్ రాష్ట్రం తెలుసు కదా! దట్టమైన అడవులు, గలగల పారే సెలయేళ్ళు, అవనికి పచ్చని కోక కట్టినట్టు ఉండే పంట భూములు.. చూస్తూ ఉంటే దేవ భూమిలా, కేరళలా కనిపిస్తూ ఉంటుంది. అన్ని బాగుంటే టూరిజం లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం గా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాదం ఆ రాష్ట్రాన్ని కకావికలం చేస్తోంది. ఎప్పుడు మావోయిస్టులు మీద పడతారో, పోలీసులను మట్టు పెడతారో ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నులో వణుకే. బీజాపూర్, దంతెవాడ, బస్తర్, కుంట వంటి ప్రాంతాల్లో మావోయిస్టులదే రాజ్యం. ఒక రకంగా చెప్పాలంటే వారు అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వారిని అక్కడ నుంచి వెళ్ళగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. గ్రేహౌండ్స్, సిఆర్పిఎఫ్, డి ఆర్ జి, స్పెషల్ పార్టీ.. ఇలా ఎన్ని రకాల పోలీసు బలగాలను అడవుల్లోకి పంపినా మావోయిస్టుల అలజడి మాత్రం ఆగడం లేదు. పైగా బలగాల కోసం అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటేటా బడ్జెట్ వ్యయం పెరుగుతోంది. పైగా మావోయిస్టులతో ఎన్కౌంటర్ జరిగినప్పుడు బలగాల్లో పోలీసులు కన్నుమూస్తున్నారు. ఇటు ఆస్తి, అటు ప్రాణ నష్టం.. ఏళ్ళుగా ఇదే నిత్యకృత్యం.

మహిళలపై మొగ్గు
మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళ శరీరం చాలా సున్నితమైనది. కానీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో వారి తర్వాతే ఎవరైనా. పైగా ఇటీవల కాలంలో ఆడవాళ్లు ఆని రంగాల్లో రాణిస్తున్నారు. దీనిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం వివిధ బెటాలియన్లలో ఆడవాళ్లకు ప్రత్యేకంగా స్థానం కల్పించింది. వారికి అత్యంత కఠినమైన శిక్షణ ఇప్పించి అన్ని విషయాల్లో రాటుదేలేలా చేసింది. ఇదే విషయాన్ని గుర్తించిన ఛత్తీస్గడ్ ప్రభుత్వం అడవుల్లో మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఉమన్ బెటాలియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 20 మంది కమాండోలను నియమించింది. వారికి డిఆర్జి స్థాయిలో శిక్షణ ఇచ్చింది. వారిని చతిస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లోకి పంపింది. ప్రస్తుతం వారంతా తెలంగాణ, చతిస్గడ్ అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వర్షాలు పడినా, వాగులు వంకలు ఉప్పొంగినా లెక్కచేయకుండా ముందుకే సాగుతున్నారు. కాగా మహిళ కమాండోలు మంచి ఫలితాలు సాధిస్తే వీరి సంఖ్యను మరింత పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ప్రతిరోజు దండకారణ్యంలో వీపున సుమారు 30 నుంచి 40 కిలోల బరువు మోస్తూ విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారని ఆ రాష్ట్ర పోలీసు వర్గాలు అంటున్నాయి.

నిరోధించడం సాధ్యమేనా?
చతిస్గడ్ అభివృద్ధికి మావోయిస్టులే అడ్డంకి.. ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ మారుమూల గ్రామంలో కనీస సౌకర్యాలు ఉండవు. ఒకవేళ ప్రభుత్వాలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధుల ద్వారా ఏమైనా పనులు నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చి కాంట్రాక్టర్లను మావోయిస్టులు హతమారుస్తారు. పరికరాలను నిలువునా తగలబెడతారు. వారి ఆగడాలకు భయపడి కాంట్రాక్టర్లు కూడా ఎవరూ ముందుకు రారు. అందువల్లే చతిస్గడ్ రాష్ట్రంలో అభివృద్ధి అంతంట మాత్రమే ఉంది. ఈ క్రమంలో మావోయిస్టులను నిలువరించేందుకు మహిళా కమాండోలను ఉపయోగించుకోవాలని చతిస్గడ్ ప్రభుత్వం భావించి దానిని అమల్లో పెట్టింది. అయితే ఎటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మహిళలకు ఉంటాయి. అందుకే వారితో ఒక బెటాలియన్ ఏర్పాటు చేశామని చతిస్గడ్ ప్రభుత్వం అంటున్నది. పైగా వారి వద్ద అధునాతన ఆయుధాలు మావోయిస్టుల వ్యూహాలను తుత్తునీయలు చేయగలవని ప్రభుత్వం భావిస్తున్నది. అడవుల్లో మావోయిస్టులకు బాగా పట్టు ఉంటుంది కనుక.. పోలీసులను మట్టు పెట్టేందుకు డెత్ స్పాట్ లు, బాంబి ట్రూప్ లు ఏర్పాటు చేస్తారు. అయితే వీటిని పసిగట్టడంలో మహిళ కమాండోలు దిట్టలు. పురుష కమాండోలతో పోలిస్తే మహిళా కమాండో లకు దూర దృష్టి ఎక్కువ. వీటి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని చత్తిస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమాండోలను నియమించింది.