AP Politics: ఆ ఒక్క మాటతోనే విపక్షాలు ఏకతాటిపైకి..

సింహమే సింగిల్ గా వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయనిజగన్ ఉద్దేశించి వైసిపి నేతలు గొప్పగా చెప్పుకునే మాట.అంటే మా పార్టీ బలంగా ఉందని.. తమను పడగొట్టాలంటే అందరూ కలిసి రావాల్సిందేనని వైసీపీ నేతల ప్రకటన ఉండేవి.

Written By: Dharma, Updated On : August 14, 2023 1:29 pm

AP Politics

Follow us on

AP Politics: వై నాట్ 175.. వైసీపీ స్లోగన్ ఇది. అంతులేని ఆత్మవిశ్వాసంతోజగన్ చెప్పుకొచ్చిన ఈ మాట క్రమేపీ వైసీపీ శ్రేణులకు విస్తరించింది.చివరకు చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని సైతం గెలిచేస్తామన్న ధీమా సగటు వైసిపి అభిమానిలో కనిపించింది.అయితే ఇది ఎప్పటి వరకు అంటే.. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వరకు. ఎందుకో తర్వాత వై నాట్ 175 స్లోగన్ కాస్త తగ్గుముఖం పట్టింది. వైసీపీలో ధైర్యం సడలింది. టిడిపిలో గణనీయంగా పెరిగింది. వై నాట్ పులివెందుల అన్న నినాదం టిడిపిలో వ్యాప్తి చెందుతోంది.

సింహమే సింగిల్ గా వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయనిజగన్ ఉద్దేశించి వైసిపి నేతలు గొప్పగా చెప్పుకునే మాట.అంటే మా పార్టీ బలంగా ఉందని.. తమను పడగొట్టాలంటే అందరూ కలిసి రావాల్సిందేనని వైసీపీ నేతల ప్రకటన ఉండేవి. ఇప్పుడవే విపక్షాల ఐక్యతకు కారణం అవుతున్నాయి. మొన్నటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలుపునకు కూడా వాటి మధ్య ఐక్యతే కారణం. ప్రత్యర్థిని బలహీనపరిచే క్రమంలో.. వైసిపి ఒంటరిగా మారిపోయే దుస్థితిని కొని తెచ్చుకుంది.

ఈ మధ్యకాలంలో చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన చేపట్టారు. రాయలసీమ ప్రాంతం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాయలసీమ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని వైసీపీ భావించింది. కానీ రాయలసీమ మేధావులు ఎవరూ చంద్రబాబు పై నోరెత్తలేదు. ఒక్క పుంగనూరు ఘటన మినహా.. వైసిపి ఊహించిన స్థాయిలో చంద్రబాబుకు ప్రతిఘటన ఎదురు కాలేదు. పైగా మిగతా విపక్షాలన్నీ చంద్రబాబు టూర్ కు సహకరించాయి. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని వైసిపి ఆరోపించింది. రాయలసీమ ఉద్యమ సంస్థల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని ఆశాభావంతో ఉండేది. కానీ అటువంటిది ఏమీ లేకుండానే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన సాఫీగా ముగిసిపోయింది. వైసిపి కలవరపాటుకి గురైంది. చంద్రబాబు పులివెందుల గడ్డపై అడుగు పెట్టి మరి జగన్ పై విమర్శలు గుప్పించగలిగారు. మొత్తానికైతే సింహం సింగిల్ గా వస్తుందని చెబుతూనే..విపక్షాలను ఏకము చేసిన ఘనత వైసిపి నేతలకు దక్కుతుంది.