YS Sharmila: ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరి కీలకం కావాలని భావిస్తున్నారు. వామపక్షాలు సైతం కాంగ్రెస్ తో జతకట్టాలని భావిస్తున్నాయి.తెలుగుదేశం,జనసేన బిజెపి కలిసి రావాలని ఆలోచన చేస్తున్నాయి.షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంతో పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని బిజెపి అనుకుంటోంది.అందుకే ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులు ఏపీకి క్యూడుతున్నారు. రాష్ట్ర బిజెపి శ్రేణుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. అందుకు అనుగుణంగా పొత్తులపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
ఎన్డీఏలో జనసేన భాగస్వామ్య పక్షంగా ఉంది. అందుకే తెలంగాణలో బిజెపితో కలిసి పోటీ చేసింది. అయితే ఆ పొత్తు అసెంబ్లీ ఎన్నికల వరకు పరిమితమని.. లోక్ సభ ఎన్నికల్లో ఉండదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఏపీలో మాత్రం బిజెపి తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. సంక్రాంతిలోగా బిజెపి నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా షర్మిల ఎంట్రీ తో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి అలెర్ట్ కావడం విశేషం. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వకూడదని బిజెపి ఆలోచన చేస్తోంది. అందుకే ఏపీలో అమలు చేయాల్సిన కార్యాచరణ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పొత్తులతో పాటు ఏపీలో ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై బలమైన కసరత్తు చేస్తోంది. ఈరోజు బిజెపి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరుగుతోంది. భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై అందరి అభిప్రాయాలను సేకరించనున్నారు.
మరోవైపు రేపు ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి జాతీయ ముఖ్య నాయకుడు తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. పొత్తులపై సభ్యుల అభిప్రాయాలను సేకరించినన్నారు. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న జనసేనతో ఇప్పటివరకు ఒక్క కార్యక్రమం కూడా జరపకపోవడానికి గల కారణాలను సైతం ఆరా తీయనున్నారు. బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్లడం ద్వారా సీట్లు, ఓట్లు పెంచుకునే అంశాన్ని బిజెపి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏపీలో పొత్తులతో వెళ్లాలా? ఒంటరిగా వెళ్లాలా? అన్నదానిపై రాష్ట్ర పార్టీ అభిప్రాయాన్ని సేకరించి కేంద్ర నాయకత్వానికి అందించనున్నారు. ఒకవేళ పొత్తు ఖరారు అయితే రాష్ట్ర పార్టీ ఏం కోరుకుంటుంది అన్నదానిపై కూడా వివరాలు సేకరించినన్నారు. అయితే ఒకవేళ టిడిపి తో పొత్తునకు పార్టీ సుముఖంగా లేకపోతే పవన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పటికే బీజేపీ నేతలు ఒక స్పష్టతకు వచ్చారు. దీంతో తరుణ్ చుగ్ ఇచ్చే నివేదిక అనుసరించి బిజెపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్నింటికీ మించి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన మరి రెండు రోజుల్లో ఏపీలో పొత్తుల వ్యవహారం పై ఒక క్లారిటీ రానుంది.