Pawan Kalyan- Chandrababu And Modi: జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ, బీజేపీని సమదృష్టితో చూస్తున్నారు. బీజేపీతో మిత్రబంధం కొనసాగిస్తూనే.. టీడీపీతో పొత్తుకు సంకేతాలిస్తున్నారు. ఉమ్మడిగానే జగన్ ను దెబ్బకొట్టగలమని భావిస్తున్నారు. వేర్వేరుగా వెళ్తే అధికార పార్టీకి లబ్ధి చేకూర్చుతామనే స్పష్టతతో ఉన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కలయికతోనే మార్పు సాధ్యమని భావిస్తున్నారు.

వైసీపీ పై పోరాటానికి పవన్ కళ్యాణ్ బీజేపీని రోడ్ మ్యాప్ అడిగారు. కానీ బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేయడంలో ఆలస్యం చేసింది. దీంతో జనసేనానిని టీడీపీకి దగ్గర చేసింది. ఆ తర్వాత మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చినప్పటికీ రోడ్ మ్యాప్ లో స్పష్టత లేదు. దీంతో జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చినివ్వను అనే ప్రకటన వచ్చింది. దీంతో బీజేపీ, వైసీపీలు ఖంగుతిన్నాయి. జనసేనాని వ్యూహం అర్థంకాక మల్లగుల్లాలు పడ్డాయి.
రోడ్ మ్యాప్ విషయంలో బీజేపీ ఆలస్యం చేయడానికి వైసీపీతో ఉన్న సంబంధాలే కారణం. వైసీపీకి ఉన్న 9 మంది రాజ్యసభ సభ్యులతో బీజేపీకి అవసరం ఉంది. పార్లమెంట్ లో బిల్లులు పాస్ చేయించుకోవడంలో వైసీపీ సహకారం అవసరం ఉంటుంది. అదే సందర్భంలో జగన్ కూడ బీజేపీ పట్ల మొదటి నుంచి సానుకూల వైఖరితో ఉంటున్నారు. దీంతో బీజేపీ వైసీపీ పై రోడ్ మ్యాప్ ప్రకటించడానికి ఆలస్యం చేసింది.

బీజేపీ, వైసీపీ వ్యవహార శైలి గుర్తించిన పవన్ కళ్యాణ్.. తన రోడ్ మ్యాప్ తానే గీసుకున్నారు. టీడీపీతో పొత్తుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఒకవైపు టీడీపీకి సానుకూల సంకేతాలు ఇస్తూనే.. బీజేపీ పై కూడ ఎలాంటి విమర్శలు చేయలేదు. బీజేపీతో కలిసి వెళ్లే ఆలోచన ఉన్నట్టు తన వైఖరితో చెప్పకనే చెప్పారు. టీడీపీ,జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి వెళ్తే ప్రయోజనం ఉంటుందని పవన్ భావిస్తున్నారు.
ఒకవైపు టీడీపీతో పొత్తు ప్రయత్నాలు కొనసాగిస్తూ.. బీజేపీని కూటమిలో చేర్చుకునే ప్రయత్నం పవన్ చేస్తున్నారు. తుది నిర్ణయాన్ని మాత్రం బీజేపీకే వదిలేశారు. అదే సమయంలో బీజేపీతో ఎలాంటి శత్రుత్వం పెంచుకునే ఆలోచనలో కూడ లేరు. కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తాం.. లేదంటే టీడీపీతో కలిసి పోరాడుతాం అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ మాత్రం టీడీపీతో కలవడానికి ఆలోచిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా టీడీపీతో కలవడానికి ఏపీలోని బీజేపీ నేతలు సుముఖంగా లేరు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది సామెత. పవన్ చొరవతో బీజేపీ, టీడీపీ కలిసే అవకాశం భవిష్యత్తులో ఉండొచ్చు.