Bharathiya Janatha Party : చంద్రబాబు ఢిల్లీకి.. బెంగళూరుకు జగన్.. వైసీపీ రాజ్యసభ పక్షం విలీనం.. బీజేపీ భారీ స్కెచ్

రాజ్యసభలో బిజెపికి బలం తగ్గింది. 90 కంటే కిందకు పడిపోయింది. ఎన్డీఏ పరంగా మెజారిటీ ఉన్నా.. కీలక బిల్లుల విషయంలో ఆమోదం పొందాలంటే ఆ బలం చాలదు. ఒకవేళ బిల్లులు వెనక్కి వస్తే మాత్రం రాజకీయంగా బిజెపికి ఇబ్బందికరమే. అందుకే బిజెపి బ్రహ్మస్త్రంతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యులను బిజెపిలో చేర్పించుకునేందుకు పెద్ద స్కెచ్ నడుపుతున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : July 16, 2024 4:43 pm
Follow us on

Bharathiya Janatha Party  బిజెపిలో వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేస్తారా? తెర వెనుక ఆపరేషన్ ప్రారంభమైందా? అందుకే జగన్ బెంగళూరు వెళ్ళిపోయారా? చంద్రబాబు ఢిల్లీ టూర్ అందుకేనా? ఈ పరిణామాల క్రమం వెనుక ఉన్న అసలు రహస్యం అదేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి జగన్ ప్రజా దర్బార్ ప్రారంభించాల్సి ఉంది. కానీ దానిని వాయిదా వేసి బెంగళూరు వెళ్లారు. కాలికి వైద్యం చేయించుకుంటారని బయటకు చెబుతున్నారు. కానీ తెర వెనుక చాలా తతంగం జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ నుంచి బిజెపి ఆపరేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

రాజ్యసభలో బిజెపికి బలం తగ్గింది. 90 కంటే కిందకు పడిపోయింది. ఎన్డీఏ పరంగా మెజారిటీ ఉన్నా.. కీలక బిల్లుల విషయంలో ఆమోదం పొందాలంటే ఆ బలం చాలదు. ఒకవేళ బిల్లులు వెనక్కి వస్తే మాత్రం రాజకీయంగా బిజెపికి ఇబ్బందికరమే. అందుకే బిజెపి బ్రహ్మస్త్రంతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యులను బిజెపిలో చేర్పించుకునేందుకు పెద్ద స్కెచ్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో వీర విధేయులు ఉన్నారు. కొంతమంది అనామకులు సైతం కొనసాగుతున్నారు. అయితే అటువంటి వారిపైన ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 11 మందిలో.. వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారిని విడిచిపెట్టి.. మిగతా వారిని లాగేసే పనిలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. 6 నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులను లాక్కుంటే ఆటోమేటిక్ గా వైసీపీ రాజ్యసభ పక్షం బిజెపిలో విలీనం కాక తప్పదు.

అయితే బిజెపి ప్రయత్నానికి జగన్ నిస్సహాయత తోడవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యులను జగన్ నియంత్రించరు. తనపై ఉన్న కేసుల దృష్ట్యా దీనికి సహకరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. నాడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు చంద్రబాబు. ఆ భారీ ఓటమితో బిజెపి నుంచి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు. అందుకే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలో చేర్పించారు. అందులో తనకు అత్యంత నమ్మకస్తులైన సీఎం రమేష్, సుజనా చౌదరి ఉన్నారు. వారే ఇప్పుడు టిడిపితో బిజెపి జత కట్టడానికి కారణమయ్యారు. బిజెపిలో చేరి టిడిపి ప్రయోజనాల కోసం పాటుపడ్డారు. ఇప్పుడు అదే ఫార్ములా తో ముందుకు సాగుతున్నారు జగన్. పార్టీ రాజ్యసభ సభ్యులను స్వచ్ఛందంగా బిజెపిలోకి పంపించిన ఆశ్చర్యపోనవసరం లేదు.

ఒకవేళ వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులను బిజెపిలో చేర్చుకుంటే.. బిజెపి అగ్రనాయకత్వం కచ్చితంగా చంద్రబాబు అభిప్రాయం తీసుకుంటుంది. అయితే నిన్నటి వరకు చంద్రబాబు టూర్ అధికారికంగా ఖరారు కాలేదు. కనీసం ఢిల్లీ పర్యటన ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. అటువంటిది ఈ అకస్మాత్తు పర్యటన వెనుక.. వైసీపీ రాజ్యసభ పక్షం బిజెపిలో విలీన ప్రక్రియ కారణమని తెలుస్తోంది. కేవలం రాజకీయ అంశాలను చర్చించేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని.. అమిత్ షా తో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. వైసిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరే విషయంలో చంద్రబాబు ఎటువంటి అభ్యంతరాలుపెట్టరని కూడా సమాచారం.కేవలం కేంద్ర ప్రభుత్వం సజావుగా నడిచేందుకు, సుస్థిర పాలన అందించేందుకు ఈ నిర్ణయం కీలకమని బిజెపి నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు సైతం దీనిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు జగన్ సైతం రాజ్యసభ సభ్యులను కాపాడుకునే స్థితిలో లేరు. పైగా తనపై అక్రమాస్తుల కేసులతో పాటు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుఎదురుగా కనిపిస్తోంది. ఏమైనా తోక జాడిస్తే బిజెపి ఏ స్థాయిలో ఇరుకున పెడుతుందో జగన్ కు తెలియంది కాదు. అందుకే ఆయన రాజ్యసభ సభ్యులను కాపాడుకోవడానికి గానీ, బిజెపిలో చేరకుండా నియంత్రించడానికి కానీ వీలు లేని పరిస్థితి. పార్టీ శ్రేణులు, సామాన్య జనాల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఈరోజు నుంచి జగన్ తో ఆ కార్యక్రమం నిర్వహించాలని గ్రాండ్ ప్లాన్ చేశారు. కానీ జగన్ ఉన్నపలంగా బెంగళూరు పయనమయ్యారు. ఈ ఆపరేషన్ విషయం తెలిసి ఆయన బెంగుళూరు వెళ్లిపోయారని తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రం గా జరిగే తంతు పూర్తయ్యాక తిరిగి ఆయన ఏపీకి చేరుకునే అవకాశం ఉంది. వైసీపీలోని 11 మంది రాజ్యసభ సభ్యులకు గాను సగానికి పైగా బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ రాజ్యసభ పక్షం బిజెపిలో విలీనమైనట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.