Botsa Satyanarayana: తాము రాజకీయ నాయకులమే అయినా.. రాజకీయ వ్యాపారం చేస్తున్నామన్నట్టుంది ఏపీ పాలకుల పరిస్థితి. అన్నీ ప్రజలకు చెప్పి.. వారికి నచ్చినట్టు చేయడం మా పనికాదంటున్నారు. తమకు నచ్చినదే చేస్తామని చెబుతున్నారు. మహా అయితే ఏమౌతుంది ఓడిపోతాం కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారు. అయితే గత మూడున్నరేళ్లుగా తాము ఎంతోకొంత పోగుచేసుకున్నామని.. ఓడినా పోయేదేమీ లేదని భావిస్తున్నారో ఏమో కానీ ఇప్పుడు ఒక్కొక్కరూ అదే భావనలో మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. 30 ఏళ్ల పాటు పవర్ లో ఉంటామని చెప్పుకొచ్చిన తమ నేతలను అనుసరిస్తూ వస్తున్న కేడర్ ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయింది. తాజాగా మంత్రి బొత్స ఇటువంటి కామెంట్స్ చేశారు. ఒక సీనియర్ మంత్రిగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి కురచ బుద్ధి చూపించుకున్నారు. రాజకీయాలు మాకు ఫ్యాషన్ కాదు.. ప్రజా సేవ కోసం కాదు….అదో వ్యాపార మార్గంగా చెప్పుకొచ్చారు.

ప్రజాస్వామ్యంలో అధికార పక్షం తప్పులను ప్రశ్నించడం విపక్షం బాధ్యత. దానికి దీటుగా బదులివ్వాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఆ బాధ్యతలను వైసీపీ పాలకులు మరిచిపోయినట్టున్నారు. చిన్న పిల్లల చాక్లెట్ తగదా మాదిరిగా ప్రజలకు ఉపయోగపడే పనుల విషయంలో చేస్తే చేస్తాం.. లేకుంటే లేదు…అన్నీ ప్రజలకు చెప్పి చేయాలా? వారికిష్టం లేకపోతే ఓడిపోతామంటూ జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ మాట్లాడడం అధికార పక్షంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒక మంత్రి నోట ఓటమి అనే మాట వచ్చేసరికి వైసీపీ కేడర్ తెగ కంగారు అయిపోతోంది. పాలకుడు అడ్డగోలుగా ఆలోచించినప్పుడు.. విపరీత బుద్ధితో వ్యవహరించినప్పుడు ఇటువంటి పర్యవసానాలు ఎదురవుతాయని ఇప్పుడు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

రాష్ట్ర భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చే నిర్ణయాలు తీసుకున్నారు. చట్టాలు, నిబంధనలు అడ్డంకిగా ఉన్నా తీసుకుంటునే ఉన్నారు. వాటిని ఎగ్జిక్యూటీవ్ చేయలేక.. కోట్లాది రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. పాలన సవ్యంగా జరుపకుండా ఇప్పుడు ప్రస్టేషన్ లోకి జారుకుంటున్నారు. కళ్లెదుట కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకత తట్టుకోలేక నిట్టూర్పు మాటలకు దిగుతున్నారు. అదే బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఆలోచించి ఉంటే.. రాష్ట్ర ఆదాయం పెరిగేది.. ఆదాయ వనరులు పెరిగేవి. మూడున్నరేళ్ల పాలనకే 30 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టి రాజకీయ వికృత క్రీడ ఆడారు. దాని పర్యవసానాలు ఒక్కొక్కటీ ఇప్పుడు ఎదురుతిరగడం ప్రారంభమయ్యాయి. బొత్సలాంటి సీనియర్లు ఇప్పుడు నిస్సహాయత వ్యక్తం చేయడంతో మున్ముందు ఇతర నేతల నుంచి ఎటువంటి నిట్టూర్పులు వినాలో మరీ.