
ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్‌లాంటి వారే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కీలక టైమ్‌లో చక్రం తిప్పగల నేత ఆయన. ఒకవిధంగా చెప్పాలంటే ఢిల్లీ రాజకీయాల్లోనూ ప్రధాని మోడీ నోట కూడా ఆయన పేరు పలుకుతుంటారు. వైసీపీకి కీలక ఎంపీ కూడా ఆయనే. ఆయన లాబీయింగ్ చేస్తే ఏ సీటు అయినా వైసీపీ ఖాతాలో పడాల్సిందే.. ఏ లీడర్ అయినా వైసీపీలో చేరాల్సిందే. అందుకే.. ఆయనను టీడీపీ పదేపదే ఆడిపోసుకుంటుంటుంది. ఆయననే టార్గెట్ చేస్తుంటుంది.
జగన్ విపక్షంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి నిత్యం మోడీ ఆఫీసులో దర్శనమిచ్చేవారు. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతుండేవారు. కానీ.. ఢిల్లీ వేదికగా ఆయన చేసే లాబీయింగ్ గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పార్టీని ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా నడిపేవారు. ఇప్పుడు కూడా ఆయన పలుకుబడిలో వచ్చిన మార్పు ఏం లేదు. ఇప్పుడు కూడా వైసీపీకి ఎంపీలలో ఆయనే పెద్ద దిక్కు. వైసీపీ పార్లమెంటరీ విభాగం కన్వనీర్‌గా.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు విజయసాయిరెడ్డి.
అయితే.. ఇంతటి ఘనాపాఠి అయిన విజయసాయిరెడ్డికి ఒక వింత అలవాటు కూడా ఉంది. ఎప్పుడూ ఆయన ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రోజువారీగా పోస్టులు పెడుతూనే ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా టీడీపీని తన ట్వీట్ల ద్వారా ఏకిపారేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ను కెలుకుతుంటారు. చంద్రబాబు ఆ స్థాయిలో తిట్టడం ఇంతవరకు జగన్ కూడా సాహసించలేదు. కానీ.. విజయసాయిరెడ్డి మాత్రం ఏమీ ఆలోచించకుండానే పోస్టులు పెడుతుంటారు. మొన్నటికి మొన్న చంద్రబాబు బర్త్‌డే రోజున బాబు 420 అంటూ దారుణమైన పదమే వాడారు. అయితే.. పుట్టిన రోజు నాడు కూడా అలా మాట్లాడడాన్ని కొందరు సొంత పార్టీ నేతలే తప్పుపట్టారట.
విజయసాయి ట్వీట్లకు ప్రతిసారీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చేవారు. కానీ.. ఏంటో ఈ మధ్య ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. దాంతో ఇక విజయసాయి తన ట్వీట్ల సంఖ్యను మరింత పెంచేశారు. ట్వీట్లతో మోత మోగిస్తున్నారు. చంద్రబాబు బ్లాక్ టికెట్లు అమ్ముకున్న రోజుల నుంచి జీవితం మొదలు పెట్టారని ట్వీట్లు చేశారు. అంతేకాదు.. బాబుకు నలుపు అంటే ఎంతో ఇష్టమని.. అందుకే బ్లాక్ మనీ కూడబెట్టారని దుయ్యబట్టారు. నిన్నటివరకు ఆయన ట్వీట్లకు ఎవరూ స్పందించకపోతుండేది. కానీ.. ఇప్పుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు చెలరేగిపోయారు. పెద్ద మనిషిగా ఉన్న విజయసాయిరెడ్డికి సంస్కారం లేదంటూ మండిపడ్డారు. జగన్ కూడా హూందాగా విష్ చేస్తే.. విజయసాయికి ఏమొచ్చిందంటూ నిలదీశారు. మొత్తంగా విజయసాయిరెడ్డి వైసీపీకి లాభమా.. నష్టమా అనేది కూడా ఎవరికీ అర్థం కాకుండా ఉంది.