కరోనా కారణంగా దారుణంగా నష్టపోయిన సినీ పరిశ్రమకు.. ప్రోత్సాహకాల సంగతి అటుంచితే ఇప్పటి వరకు.. ఇవ్వాల్సిన అనుమతులు కూడా ఇవ్వలేదు జగన్ సర్కారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని అనుమతులూ ఇవ్వడమే కాక.. ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. కానీ.. ఏపీలో మాత్రం పరిస్థితి ఇంకా అధ్వానంగానే ఉంది. ఇప్పటికీ అక్కడ థియేటర్లలో నాలుగు షోలు పడట్లేదు. టిక్కెట్లు సగం మాత్రమే అమ్ముకోవాల్సి వస్తోంది. అది కూడా.. ఎప్పుడో పదేళ్ల నాటి ధరలకు విక్రయించాలని జీవో ఇచ్చింది. ఇన్ని అవస్థల నడుమ.. కొత్తగా ఆన్ లైన్ టిక్కెట్లు అమ్ముతామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా.. సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా ఇదేంటని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రితో టాలీవుడ్ మీటింగ్ అంటూ.. నెల రోజులుగా ఊరిస్తున్నారు తప్ప, అపాయింట్ మెంట్ ఇచ్చింది లేదు. అసలు మీటింగ్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. సమావేశం జరిగినా.. ఇండస్ట్రీ కోరికలు తీరుస్తారనే నమ్మకం లేదని కూడా కొందరు అంటున్నారు. చిరంజీవి మొన్నటి సినిమా ఫంక్షన్లో ‘‘ప్లీజ్ అర్థం చేసుకోండి’’ అంటూ ప్రాధేయపడ్డారే తప్ప ప్రశ్నించలేదు. మిగిలిన వారు నోరు మెదిపింది లేదు. ఇలాంటి సమయంలో.. సాయిధరమ్ తేజ్ సినిమా ఫంక్షన్ కు వచ్చిన పవన్ పదునైన విమర్శలతో ప్రభుత్వాన్ని నిలదీశారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని కొందరు అంటున్నారన్న పవన్.. అదేం పుణ్యానికి వచ్చింది కాదన్నారు. ఎక్కడా దోపిడీ చేసేది కాదన్నారు. ఒళ్లు హూనం చేసుకొని, డ్యాన్సులు, ఫైట్లు చేస్తే వచ్చే సొమ్ము అన్నారు. అందులోనూ భారీగా ప్రభుత్వానికి పన్ను కడుతున్నట్టు గుర్తు చేశారు. కొందరు రాజకీయ నాయకుల్లాగా పన్నులు ఎగ్గొట్టి, అవినీతికి పాల్పడి దోచుకుంటున్నది కాదని అన్నారు.
కేవలం ఏదో ప్రసంగంలో నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోవడం అనే రీతిలో కాకుండా.. సమస్య పరిష్కారానికి యావత్ ఇండస్ట్రీ మొత్తం నడుం బిగించాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. ప్రాథేయపడాల్సిన అవసరం లేదన్న పవన్.. మోహన్ బాబు లాంటి వాళ్లు కూడా సమస్యపై స్పందించాలని సూచించారు. ఇప్పుడు మాట్లాడకపోతే.. రేపు పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందని, ఈ పెత్తనాన్ని సహించొద్దని, పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు వ్యాపారాల్లో ప్రభుత్వ పెత్తనం ఏంటని నిలదీశారు.
పవన్ ప్రసంగం సినీ పరిశ్రమతోపాటు రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. ఇప్పుడు బంతి సినీ ఇండస్ట్రీ కోర్టులోకి వెళ్లిందని అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం తాను ఏం చేయాలనుకుందో.. అది చేస్తూ వెళ్తోంది. పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుందని పవన్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇండస్ట్రీలోని ప్రముఖులు ఏం చేస్తారు? పవన్ వెంట నడుస్తారా? భయపడిపోయి జగన్ వెనకే ఉంటారా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇండస్ట్రీ స్పందించకపోతే పవన్ కు పోయేది ఏమీ లేదని, సినీ పరిశ్రమ మరింత అవస్థలు అనుభవించాల్సిన పరిస్థితులు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి, సినీ పెద్దలు ఏం చేస్తారన్నది చూడాలి.