టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ రేసు మొదలైంది. గవర్నర్ కోటాలో రెండింటితోపాటు మరొక స్థానం ఖాళీ అయింది. దీంతో ఆశావహులు ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీనే నమ్ముకొని ఉన్నవారితోపాటు గత ఎన్నికల్లో అనుహ్యంగా ఓటమిపాలైన వారి వివరాలను ఇప్పటికే సీఎం కేసీఆర్ సేకరించి పదవులను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
Also Read: మాస్కు పెట్టుకోలేదని మేకను అరెస్టు చేసిన పోలీసులు..!
ఎమ్మెల్సీ రేసులో ఇప్పటికే చాలామంది టీఆర్ఎస్ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే గతకొద్దిరోజులుగా తుమ్మల నాగేశ్వరరావు పేరు ఈ లిస్టులో వెనుకంజలో ఉంది. అయితే అనుహ్యంగా మరోసారి తుమ్మల నాగేశ్వర్ రావు ఎమ్మెల్సీ రేసులోకి ముందుకు దూసుకురావడం గమనార్హం. తాజాగా ఆయనకు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో ఆయన హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో తుమ్మల అనుచరులు ఆయన ఎమ్మెల్సీని ఖరారు చేసేందుకే సీఎం కేసీఆర్ పిలిచారని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ గత క్యాబినెట్లో తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పని చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు అనుహ్యంగా ఓటమి పాలైయ్యారు. దీంతో నాటి నుంచి తుమ్మల ఆయన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లోనూ, సీఎం పక్కన కూడా ఎక్కడా కన్పించలేదు. మరోవైపు అదే జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కు మంత్రి పదవీ దక్కడంతో తుమ్మలకు రాజకీయం చెక్ పడినట్లేనని అంతా భావించారు.
Also Read: తొందరపడిన బాబు బకరా అయ్యారే..!
అయితే సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల పంపకం చేపట్టే సమయంలో తుమ్మలకు పిలుపురావడంతో ఆయన పదవీ దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే ఖమ్మం జిల్లాకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. నిన్నటి వరకు తుమ్మలను కేసీఆర్ పక్కకు పెట్టారని ప్రచారం జరుగగా అనుహ్యంగా ఆయనకు పిలుపురావడం చర్చనీయాంశంగా మారింది. తుమ్మలకు ఎమెల్సీ పదవీ కట్టబెడితే పొంగిలేటి పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తుంది. గతంలోనే పొంగిలేటి రాజ్యసభ సీటు విషయంలో నిరాశ ఎదురైంది. తాజాగా ఎమ్మెల్సీ కూడా చేజారే అవకాశం కన్పిస్తుంది.
అయితే తుమ్మలకు గతంలోనే మాదిరిగానే అదృష్టం కలిసివస్తే ఎమ్మెల్సీతోపాటు మంత్రి పదవీ దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో తుమ్మల విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.