Jagan Vs Chandrababu: ఇక్కడితో ఈ పగ ఆగుతుందా? నష్టం వ్యవస్థకే..

గత నాలుగున్నర ఏళ్లుగా ఏపీలో జరుగుతున్న విధ్వంసకర రాజకీయాలు అందరికీ తెలిసిందే. నేతల మధ్య రాజకీయాల కోసం పేదలను బలి చేసిన సందర్భాలు ఉన్నాయి.

Written By: Dharma, Updated On : September 11, 2023 5:38 pm

Jagan Vs Chandrababu

Follow us on

Jagan Vs Chandrababu: ముసలాయన.. ముసలాయన అంటూ చంద్రబాబును జగన్ చావు దెబ్బ కొట్టారు. చంద్రబాబుకు జైల్లో పెట్టారు. ఇప్పటివరకు నేను నిప్పు అంటూ చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఆ అవకాశం లేకుండా చేశారు జగన్. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఇక చంద్రబాబు మొహమాటలకు పోరు. జగన్ వలే మొండిగా వ్యవహరిస్తారు.అప్పుడు నష్టపోయేది ఎవరు? కచ్చితంగా రాజకీయాలు చేసేవారే. తొలుత జగన్ ను నష్టం చేయాలని చూస్తారు. తరువాత ఆయన వెంట ఉండే నాయకులు చాలా వరకు బాధ్యులు అవుతారు.

రాజకీయాల్లో ఉండేవారు ఎటువంటి వివాదాలు లేకుండా ఉంటారా? అసలు ఉండగలరా? ఎక్కడో భూవివాదమో? ఇసుక, మట్టి తవ్వకాలో.. ఇలా ఏదో ఒక వివాదంలో తప్పకుండా ఉంటారు. వాటికి బాధ్యులు చేస్తూ కేసులు నమోదు చేయడం, జైలులో పెట్టడం ఇక్కడ నుంచి పరిపాటిగా మారుతుంది.2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. రాజకీయ ప్రత్యర్థులపై జరిగేది ఇదే. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు ఈ రాజకీయాలంటూ నిట్టూరుస్తున్నారు. సీనియర్ మంత్రులు సైతం చాలామంది.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రివేంజ్ రాజకీయాలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. భవిష్యత్తులో తాము బాధ్యులవుతామని భయపడిపోతున్నారు.

గత నాలుగున్నర ఏళ్లుగా ఏపీలో జరుగుతున్న విధ్వంసకర రాజకీయాలు అందరికీ తెలిసిందే. నేతల మధ్య రాజకీయాల కోసం పేదలను బలి చేసిన సందర్భాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటం అనేది ఒక చిన్న గ్రామం. జనసేన ఆవిర్భావ సమావేశానికి ఆ గ్రామ రైతులు స్థలాలు ఇచ్చారన్న పాపానికి గ్రామాన్ని నేలమట్టం చేసినంత పని చేశారు. అసలు వాహనాలు వెళ్ళలేని ఆ గ్రామంలో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లను తొలగించారు. బాధితులుగా మిగిలిన వారు.. కోర్టులను ఆశ్రయిస్తే తిరిగి వాళ్లనే నిందితులుగా చూపించారు మన ప్రభుత్వ పెద్దలు. వారితోనే కోర్టుకు అపరాధ రుసుము కట్టించగలిగారు. పవన్ కళ్యాణ్ ను ఆరాధించారనే ఒకే ఒక నెపంతో ఇప్పటం గ్రామస్తులకు పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు.

రాజధాని రైతులకు ఏ స్థాయిలో వేధింపులకు గురి చేశారో అందరికీ తెలిసిన విషయమే. నేరస్తులుగా చూపించేందుకు వారిళ్లలో మద్యం సీసాలు సైతం ఉంచారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చినందుకు వారిపై కుల ఉన్మాదాన్ని చూపారు. లేనిపోని నిందలు వేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను చేశారు. ఇలా చెప్పుకుంటే అనేకం. అటు వ్యవస్థలను, ఇటు వ్యక్తులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో ఇదో ఫ్యాషన్ గా పేర్కొన్నారు. ఇటువంటి వేధింపులు వైసీపీ సర్కార్ తో ఆగుతాయా? అంటే ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఇక్కడి నుంచి కచ్చితంగా కొనసాగుతాయి. అలా చేయకపోతే ఇప్పుడు బాధితులుగా ఉన్నవారు అసమర్థులుగా మిగిలిపోతారు. అందుకే ఇంతకుమించి స్పందిస్తారు. అప్పుడు జరగబోయేది ప్రజాస్వామ్య విఘాతమే. అందుకే పాలకులు విశాలా దృక్పథంతో ఆలోచించాలి అంటారు. కానీ అటువంటి ఆలోచన ఏపీలో మచ్చుకైనా కానరావడం లేదు.