రాజధాని అమరావతిని విభజించబోతున్నామని, ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నామని రెండేళ్ల క్రితం సంచలన నిర్ణయం ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం తీసుకున్న నిర్ణయాల్లో సంచలనం రేకెత్తించిన నిర్ణయమిది. రాష్ట్ర భవిష్యత్ పై ప్రభావం చూపే నిర్ణయమిది. ఈ ప్రకటన చేసి సరిగ్గా 500 రోజులు గడిచాయి. అయితే.. ఇప్పటి వరకూ ఎన్ని అడుగులు పడ్డాయి? మూడు రాజధానుల నిర్ణయం అమలు ఎంత వరకు వచ్చింది? అనే ప్రశ్నకు సరైన సమాధానాల్లేవు.
2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు జగన్. ఏపీలో సౌతాఫ్రికా మోడల్ ను ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారు. కర్నూలును న్యాయ రాజధాని అన్నారు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతామన్నారు. ఈ ప్రకటనపై అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకూ మూడు రాజధానుల కథ ముందుకు కదలకపోవడం విశేషం.
కొత్త రాజధానులు అమల్లోకి రాలేదుగానీ.. ఉన్న రాజధాని మాత్రం దెబ్బతినిపోయిందన్నది కాదనలేని వాస్తవం. అక్కడి నుంచి రాజధాని తరలిపోతోందన్న ప్రకటనతో పెట్టుబడి దారులు వెనక్కి వెళ్లిపోయారు. కొందరు తిరిగి హైదరాబాద్ బాటపడితే.. మరికొందరు ఇతర రాష్ట్రాలను కూడా చూసుకున్నారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అక్కడ పలు రంగాలపై ఆధారపడిన వారి ఉపాధికి సైతం ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఇది ఒకెత్తయితే.. అక్కడ భూములు ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న కూడా ఉంది. చంద్రబాబు హయాంలో సీఆర్డీఏను ఏర్పాటు చేశారు. దీని ప్రకారం.. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంటే.. రైతులకు పరిహారం చెల్లించాలి. 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం అందించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద పరిహారం చెల్లించాల్సి వస్తే.. ఏకంగా 72 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. మరి, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అన్నది అంతుచిక్కని ప్రశ్న. మరి, ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్నది చూడాలి.