Volunteer System In AP: ఏపీ వలంటీర్ల వ్యవస్థపై ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల అనంతరం అందరి చూపు వలంటీర్లపై మళ్లింది. తెలిసో తెలియకో హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. తాజాగా ప్రతి ఇంటికి తిరిగి సేకరించిన ఆధార్ కార్డు, ఇతర వివరాలను హైదరాబాదులోని ఓ కంపెనీకి విక్రయించారని పవన్ అన్న మాటలు యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని విస్మయానికి గురి చేస్తుంది. అసలు వలంటీర్లతో వైసీపీ చేయించుకుంటున్నది సేవేనా? లేదా ఇంకోటా అన్నది తెలియాల్సి ఉన్నది.
వలంటీర్లపై పక్కా ఆధారాలతో పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. కొంతమంది వలంటీర్లు చేస్తున్న ఆకృత్యాల వల్ల మొత్తం ఆ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. దీనిపై వలంటీర్లను వైసీపీ నాయకులు రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలను చేయించినా, పవన్ కల్యాణ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన చేపట్టిన వారాహి యాత్రలో మరోసారి వలంటీర్ల అంశంపై మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల డేటా మొత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఏజెన్సీ వద్ద ఎందుకుంది? ఎలా వెళ్లిందో జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు కూడా గతంలో వలంటీర్లపై విమర్శలు చేసిన వారే. జగన్ వారిని నియమించుకొని ఏం చేస్తున్నాడని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలకు ఓటర్లను మభ్యబెట్టి, భయపెట్టేందుకు వారిని వాడనున్నట్లు కూడా తెలిపారు. వలంటీర్లందరూ వైసీపీ సానుభూతిపరులేనని అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు స్వరం మార్చిన చంద్రబాబు, లోకేష్… వలంటీర్లను తొలగించేది లేదని అన్నారు. అభద్రతా భావం వద్దని తమ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తామని ప్రకటించారు.
టీడీపీ మాట మార్చినట్లుగా పవన్ కల్యాణ్ మార్చడం లేదు. వలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం చేయిస్తున్న అక్రమాలను బయటపట్టేందుకు నడుం బిగించారు. అందరూ చెడ్డవారు అని అనడం లేదని, కొందరి వల్ల ఆ మాట అనాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద చూసుకుంటే 2024 ఎన్నికల తరువాత వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, ఇంకా వలంటీర్లు ఎందుకు అని పవన్ కల్యాణ్ తో పాటు చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వలంటీర్లను కొనసాగిస్తామని అంటున్నా.. నమ్మశక్యంగా లేదు. దీంతో వలంటీర్ల భవితవ్యం డోలాయమానంలో పడిపోయింది.