
Tripura Election: అక్కడ ఒకప్పుడు కమ్యూనిస్టులకు తిరుగులేదు. 25 ఏళ్లు ఏకచత్రాధిపత్యంతో ఏలారు. తిరుగులేని మెజార్టీని సాధించారు. ఎర్రజెండాను రెపరెపలాడించారు. కానీ కాలం మారింది. కమ్యూనిస్టుల కోట బద్ధలైంది. కాషాయ పార్టీ హస్తగతమైంది. ఇప్పుడు కమ్యూనిస్టులు పూర్వవైభవం కోసం పోరాడుతున్నారు. బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఇప్పుడు కాలం కలిసొస్తుందా ? కమ్యూనిస్టులకు మళ్లీ అధికారం దక్కుతుందా ? అన్నదే ప్రశ్న.
Also Read: RBI Locker Rules: ఆర్బిఐ కొత్త లాకర్ నిబంధనలు ఇవే: పాటించకుంటే సీజ్ చేస్తారు
త్రిపుర ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. మాణిక్ సర్కార్ 25 ఏళ్లు అప్రతిహతంగా త్రిపురను ఏలారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అయినప్పటికీ ఏకఛత్రాధిపత్యంతో ఏలిన కమ్యూనిస్టులను త్రిపుర ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల్లో ఓడించి.. బీజేపీకి అధికారం ఇచ్చారు. ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ త్రిపురలో ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలు గెలుపు కోసం నిర్విరామంగా పోరాడుతున్నాయి. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. బీజేపీ స్థానిక ఐపీఎఫ్టీతో జత కట్టింది. టీఎంసీ, తిప్రమోత పార్టీలు తమ శక్తి మేరకు పోటీ చేస్తున్నాయి.

గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 60 స్థానాలకు గాను 3,328 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 28.13 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీపీఎం నుంచి మాణిక్ సర్కార్, ప్రకాశ్ కారత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి అధిర్ రంజన్ చౌదరి, అజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు.
2018 ఎన్నికల్లో బీజేపీ 43 శాతం ఓట్లు సాధించింది. మొత్తం 60 సీట్లలో 36 స్థానాలు గెలుచుకుంది. సీపీఎం విజయ ప్రస్థానానికి అడ్డుకట్ట వేసింది. ఐదేళ్లు అధికారం అనుభవించింది. ఇప్పుడు బీజేపీకి అగ్నిపరీక్ష మొదలైంది. త్రిపుర ప్రజల విశ్వాసాన్ని మళ్లీ చూరగొనాల్సి ఉంది. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, నరేంద్ర మోదీ ప్రజాకర్షణ మళ్లీ అధికారం తీసుకొస్తుందని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో బీజేపీ వైఫల్యాలు తమను గట్టెక్కిస్తాయని కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. అయితే త్రిపుర ప్రజలు ఎవరిని అధికార పీఠం పై కూర్చోబెడతారో వేచిచూడాలి.
Also Read:Jayamangalam Venkataramana: టీడీపీకి పెద్ద షాక్.. పార్టీని వీడిన మరో నేత