AP BJP: బిజెపిలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. టిడిపి, జనసేనలతో పొత్తు కుదరడంతో గెలుపు ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో చాలామంది నాయకులు తెరపైకి వస్తున్నారు. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని నాయకత్వాన్ని కోరుతున్నారు. దీంతో బిజెపి హై కమాండ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో తెలియక సతమతమవుతోంది. ఇంతకుముందే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు.. ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల చొప్పున జాబితాను రూపొందించి రాష్ట్ర నాయకత్వం హై కమాండ్ కు నివేదించింది. దీంతో చాలామంది పోటీకి సిద్ధంగా ఉన్నారు. అటువంటివారు చాలా విధాలుగా లాబీయింగ్ చేసుకుంటున్నారు. అయితే పొత్తులో భాగంగా బిజెపికి ఆరు అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాలు దాకడంతో అభ్యర్థుల ఎంపిక బిజెపి హై కమాండ్ కు కత్తి మీద సాముగా మారింది.
వాస్తవానికి ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రమే. ఒంటరిగా పోటీ చేస్తే వార్డు సభ్యులు, కౌన్సిలర్లుగా కూడా గెలవలేని స్థితిలో బిజెపి ఉంది. అటువంటిది పొత్తులో భాగంగా ఆరు అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కడంతో ఎలాగైనా గెలుపొందుతామని బిజెపి నేతలు ఆశతో ఉన్నారు. అందుకే పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి నుంచి కిందిస్థాయి నేత వరకు అందరూ ఆశావహులుగా మారిపోయారు. పెద్ద ఎత్తున టికెట్లు ఆశిస్తున్నారు. తమకు టిక్కెట్ తప్పకుండా వస్తుందని ఆశతో ఉన్నారు. ఎమ్మెల్యే అయిపోదామని భావిస్తున్నారు. టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ ప్రారంభించారు.
2014లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పొత్తులో భాగంగా విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు.ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తానని విష్ణుకుమార్ రాజు బలంగా చెబుతున్నారు. చాలా రోజులుగా పొత్తుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు టిడిపి నాయకత్వంతో సైతం సఖ్యతగా మెలుగుతూ వస్తున్నారు. ఆయనకు ఈసారి టిక్కెట్ ఖరారు కచ్చితమని తేలుతోంది. అటు తాడేపల్లిగూడెం, కైకలూరులో సైతం గతంలో టిడిపి తో పొత్తులో భాగంగా బిజెపి గెలుచుకుంది. దీంతో ఆ రెండు స్థానాల్లో విపరీతమైన పోటీ ఉంది. కైకలూరు నుంచి గతంలో పొత్తులో భాగంగా గెలిచిన కామినేని శ్రీనివాస్.. మరోసారి టిక్కెట్ ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో సైతం పోటీకి బిజెపి నేతలు సిద్ధపడుతున్నారు. అయితే అక్కడ జనసేనకు కీలక నేత ఉండడంతో పక్కన ఉన్న ఉంగటూరు తీసుకోవాలని జనసేన రిక్వెస్ట్ చేస్తోంది. మరి జనసేన ఎలాంటి ఆలోచనతో ఉందో చూడాలి. మొత్తానికైతే పొత్తుతో చాలామంది బిజెపి నేతలు బయటకు రావడం విశేషం. టికెట్ దక్కించుకునేందుకు టిడిపి నేతలను ఆశ్రయిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.