AP PRC Issue: పీఆర్సీపై అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి దాకా చర్చలే లేవన్న ఉద్యోగుల సంఘాలు.. సడెన్ గా మంత్రుల కమిటీతో చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చాయి. అయితే చలో విజయవాడ కంటే ముందుగానే చర్చలకు వెళ్లడంతో ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని అంతా ఆశించారు. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు చర్చలే లేకుండా ఉద్యోగ సంఘాల నేతలు వెనుదిరగాల్సి వచ్చింది.
ఎందుకంటే.. సచివాలయానికి మంత్రుల కమిటీతో చర్చలు జరిపేందుకు వెళ్లిన పీఆర్సీ సాధన సమితి సభ్యులు మూడు డిమాండ్లను వారి ముందు ఉంచారు. ఒకటి జనవరి జీతాలు పాత పద్ధతిలోనే ఇవ్వాలని, అలాగే అశుతోశ్ మిశ్రా ఇచ్చిన నివేదికను అందరికీ బహిర్గతం చేయాలని, అలాగే పీఆర్సీపై ఇచ్చిన జీవోను నిలిపివేయాలంటూ చెప్పారు. ఈ మూడు డిమాండ్లకు ఓకే అంటేనే చర్చలు జరుపుతామంటూ స్పష్టం చేశారు.
దాంతో మంత్రులు రియాక్ట్ అయి.. ఉద్యోగ సంఘాల నేతలను సచివాలయంలోనే ఉండాలని, చెప్పి టైమ్ తీసుకున్నారు. ఈ లోగా సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్‌లు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఎంత జీతాలు పెరిగాయన్నది వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి దగ్గరి నుంచి ఉద్యోగ సంఘాల మూడు డిమాండ్లకు ఓకే చెప్పడం కుదరదనే సంకేతాలు వచ్చాయి.
Also Read: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇంత అన్యాయమా.. పైసలు లేవు.. ప్రాజెక్టులు లేవు..!
దీంతో ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కూడా వెనుదిరిగారు. చర్చలకు పిలిచి అవమానించారంటూ ఐకాస అమరావతి చైర్మన్ వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారు. ఇక యథావిధిగానే తమ కార్యచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు పే స్లిప్పుల దహనంతో పాటు 3న చలో విజయవాడను నిర్వహిస్తామన్నారు. ఇక సమ్మె కూడా కచ్చితంగా ఉంటుందని, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొనాలంటూ చెప్పారు. అయితే ప్రభుత్వం అంది వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే సమ్మెకంటే ముందే ఉద్యోగులు చర్చలకు వచ్చినప్పుడు ఏదోలా దారికి తెచ్చుకోవాల్సింది పోయి.. కనీసం చర్చలు కూడా నిర్వహించకుండా చేయడం ప్రభుత్వానికే నష్టం అని చెబుతున్నారు. ఇప్పటి దాకా అంతో ఇంతో ఉన్న నమ్మకాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా పోగొట్టుకుంది. ఇక మరోసారి చర్చలకు పిలిచినా.. ఉద్యోగులు మాత్రం వచ్చేలా కనపడట్లేదు. మరి ప్రభుత్వం మరేదైనా స్టెప్ తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.
Also Read: పోలవరం వదిలేసి ‘కెన్ బెత్వా’కు వేల కోట్లు.. మోడీ ఇది న్యాయమా?