Chandrababu: వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే స్కిల్ డెవలప్మెంట్ కేసు వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల కిందటే కేసు నమోదు చేశారు. కానీ సిఐడి కోర్టులో అవినీతి జరిగిందని కనీస ఆధారాలు కూడా చూపించలేకపోయారు. ఇప్పటివరకు చార్జిషీట్ సైతం దాఖలు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసు విషయంలో హడావిడి తప్ప.. కోర్టులో కేసు నిలబడుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. అయితే చంద్రబాబును అరెస్టు చేసి ఒక రోజైనా జైలుకు పంపించాలన్న ప్రయత్నంలో భాగంగా.. ఈ కేసు విషయంలో పట్టు బిగిస్తున్నట్లు తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ లో భారీ స్కాం జరిగిందని 2021 లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ నిధులు రూ. 241 కోట్లు కొల్లగొట్టారని అప్పట్లో సిఐడి కేసు నమోదు చేసింది. మొత్తం 26 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే అందులో చంద్రబాబు పేరు లేదు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఏపీలోనూ స్కిల్ సెంటర్లు పెట్టారు. యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. చాలామంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందారు. ఉద్యోగాలు సైతం తెచ్చుకున్నారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఇవి కొనసాగాయి.
అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు విషయంలో ప్రభుత్వ వాటా పక్కదారి పట్టింది అనేది ప్రధాన ఆరోపణ. 90% సి మెన్స్, డిజైన్ టెక్ సంస్థలు భరించాలని.. 10 శాతం ప్రభుత్వం భరించేలా అప్పట్లో ఒప్పందం జరిగింది. దాదాపు 3 వేల కోట్లు సంబంధిత కాంట్రాక్టు సంస్థలు పెట్టుబడిగా పెట్టాలి. కానీ అవి పెట్టకుండానే ప్రభుత్వ నిధులు దారి మళ్లాయి అనేది సిఐడి చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే సి మెన్స్, డిజైన్ టెక్ సంస్థలు సెంటర్ల ఏర్పాటు, మౌలిక వసతులు, నిర్వహణ తదితర వ్యాయాన్ని భరించాయి. అయితే డబ్బు రూపంలో పెట్టుబడి పెట్టలేదు అన్నది సిఐడి వాదన.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు కనిపిస్తోంది.. అందులో మౌలిక వసతులకు ఖర్చు వివరాలు ఉన్నాయి. అక్కడ శిక్షణ, వసతి పొందిన విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికీ ఆ సెంటర్లు కొనసాగుతున్నాయి. అయితే స్కాం ఎలా జరిగిందనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.
అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ను పర్యవేక్షించిన కమిటీలకు సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, రావత్ లు నేతృత్వం వహించారు. ప్రస్తుతం జగన్ సర్కారులో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. అప్పట్లో వారి సిఫార్సులు మేరకే అన్ని జరిగాయి. అటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుకు ఎండిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి చెల్లింపులు చేశారు. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్జ శ్రీకాంత్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి స్కాం జరగలేదని తేల్చి చెప్పారు. అటు తర్వాత ఆయన వైసీపీ ప్రభుత్వ బాధితుడిగా మారిపోయారు. ఒకవైపు చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్ జాబితాలో లేకపోవడం, నేడు జగన్ సర్కార్లో కీలకపాత్ర పోషిస్తున్న అధికారులే అప్పట్లో దీనికి నేతృత్వం వహించడం వంటి కారణాలతో ఈ కేసు నీరుగారిపోతుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అటు సిఐడి దూకుడు చూస్తుంటే.. చంద్రబాబుని అరెస్టు చేసి.. జైలులో పెట్టడం వరకే అన్నట్టు ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో చాలా సిఐడి కేసుల్లో ఇదే ఉత్పన్నమైంది. ఈఎస్ఐ కేసులో అచ్చెనాయుడు అరెస్టు మాదిరిగా మిగిలిపోతుందని టాక్ నడుస్తోంది.