Chandrababu vs Jagan : రాజకీయాల్లో హత్యలే ఉంటాయి.. ఆత్మహత్యలు ఉండవు అంటారు. ఈ లెక్కన చంద్రబాబుది స్వయంకృతాపమా? లేకుంటే ఆయన లెక్క తప్పరా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు జైలు జీవితానికి 50 రోజులు దాటుతోంది. ఇంతకీ ఈ ఘనత ఎవరిది అంటే? ముమ్మాటికీ ఏపీ సీఎం జగన్ ది అంటారు. జగన్ తో పోల్చుకుంటే ఇది పెద్ద జైలు జీవితం కాదు కానీ.. రిటైర్మెంట్ వయసు దాటిన చంద్రబాబుకు ఇది అసలు సిసలైన పనిష్మెంటే. అసలు చంద్రబాబు అరెస్టు కారని భావించారు. అరెస్టు అయిన గంటల వ్యవధిలో బయటకు వస్తారని అంచనా వేశారు. కానీ గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలుగా మారాయి.. వారాలు నెలలు దాటాయి. అయినా సరే చంద్రబాబుకు విముక్తి కలగలేదు. అసలు సిసలైన పొలిటికల్ గేమ్ లో చంద్రబాబు పావుగా మారారు.
వాస్తవానికి చంద్రబాబు ఈ పరిస్థితిని ఊహించలేదు. ఊహించే లోగా అరెస్టు జరిగిపోయింది. రిమాండ్ జరిగిపోయింది. అప్పుడే జైలు జీవితం 50 రోజులు పూర్తయింది. నిజానికి చంద్రబాబు అసలు తాను జీవితంలో అరెస్టే కానన్న ధీమాతో ఉండేవారు. నీ బాబే నా ముందు తోక ఊపలేదు. ఏం పీక్కుంటావో పీక్కో. నా ముందు నువ్వు ఎంత జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ఎగతాళి చేశాడు. దానికి మూల్యం చెల్లించుకున్నాడు. అసలు చంద్రబాబు అరెస్టే కాడు. అరెస్ట్ అయినా బెయిల్ తీసుకుని నేరుగా ఇంటికి వెళ్తాడు. జైల్ ముఖం కూడా చూడడు అని భావించారు తెలుగు తమ్ముళ్లు. కానీ చంద్రబాబుకు జగన్ చుక్కలు చూపించాడు. 50 రోజులు పాటు రిమాండ్ ఖైదీగా ఉంచాడు.
ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరు ట్రాప్ లో ఎవరు పడ్డారంటే.. ముమ్మాటికీ జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడినట్టే కనిపిస్తోంది. గత ఆరు నెలలుగా చంద్రబాబు దూకుడు పెంచారు. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. చివరి ఏడాది కావడం, గత నాలుగు సంవత్సరాలుగా ఏమి చేయలేకపోవడంతో ఇక తనకు తిరుగు లేదని చంద్రబాబు భావించారు. గత ప్రభుత్వ హయాంలో ఏ తప్పు చేసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు.. తాను తప్పు చేసినా తెలివిగా చేస్తానని చంద్రబాబు భావించారు. ఆ తప్పే చంద్రబాబును జగన్కు పట్టించింది. బలవంతంగా జైలు పాలు చేయాలంటే ఏ తప్పు అవసరం లేదని.. చిన్న సాంకేతిక పరమైన తప్పు చాలు అని జగన్ భావించారు. చిన్న సాంకేతికపరమైన తప్పిదాలతో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో పట్టు బిగించారు. చివరకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్లతో చంద్రబాబుకు చుక్కలు చూపించారు. 50 రోజులుగా ఎడాపెడా లాజిక్ పాయింట్లతో కేసును బిగుసుకునేలా చేశారు.
సంక్షేమమే తప్ప అభివృద్ధి లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్వాంతన లేదు. అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం దూరమైంది. విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇటువంటి తరుణంలో ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. భవిష్యత్తుకు గ్యారెంటీ వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే తన బుర్రకు పదును పెట్టారు జగన్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన చిన్నపాటి తప్పిదాలను హైలెట్ చేశారు. అందులో సాంకేతిక అంశాలను తీసుకుని చంద్రబాబుపై కేసులు నమోదు చేయగలిగారు. అరెస్టు చేయగలిగారు. రోజుల తరబడి రిమాండ్ లో ఉంచగలిగారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు అరెస్ట్ వైపు మళ్లించగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు అరెస్ట్ అనేది పగ, ప్రతీకారంతో చేసింది కాదు. తన ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునే ఆయుధంగా జగన్ భావించారు. ఆ విధంగానే ప్రయోగించి సక్సెస్ అయ్యారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.