వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. కనీసం కొన్నా ప్రాంతాలలోనైనా తన ప్రభావం చూపెట్టాలని భావిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్ కు ఇప్పటికీ అభిమానులున్నారు. రెడ్డి, దళిత సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుని ముందుకు కదులుతున్నారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పైనే గురిపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్లు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
వైఎస్ షర్మిల పార్టీ పేరు కూడా ఖరారయింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె జనం ముందుకు రాబోతున్నారు. వచ్చే నెలలో వైఎస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటించే అవకాశముంది. దీంతో పాటు జులై నెల తర్వాతత ఎప్పుడైనా ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు కడా ప్లాన్ చేసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి క్యాడర్ నిర్మాణం చేసుకోవడమే ఇప్పుడు వైఎస్ షర్మిల ముందున్న లక్ష్యం.
తెలంగాణలో అనేక చోట్ల వైఎస్ షర్మిల పార్టీకి కేడర్ లేదు. నాలుగైదు జిల్లాలు మినహాయిస్తే ఎక్కడా బలమైన నేతలు లేరు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి నెలరోజులు దాటిపోయినప్పటికి వైఎస్ షర్మిల పార్టీలోకి నేతలు ఎవరూ రాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున తన పార్టీలోకి వస్తారని వైఎస్ షర్మిల భావించారు.
షర్మిల పార్టీలోకి ఏ పార్టీ నేతలు కూడా రావడానికి సాహసం చేయడం లేదు. తెలంగాణలో హుజురాబాద్ మినహా ఏ ఎన్నికలు లేవు. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలపై షర్మిల ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో తెలంగాణ శాసనసభలోకి తమ పార్టీ ప్రాతినిధ్యం కల్పించాలన్నదే ఆమె లక్ష్యం.