Ukraine : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వచ్చే ఏడాది ఫిబ్రవరికి మూడేళ్లు పూర్తి కానుంది. వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై క్రూరమైన దాడులకు పాల్పడుతుండగా, ఉక్రెయిన్ యోధులు ప్రతీకారంగా రష్యాకు భారీ ఎదురుదెబ్బలను అందజేశారు. ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్దం జరిగింది. ఇంకా వీరి మధ్య సంధి సాగలేదు. గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక నివేదికల ప్రకారం, రష్యా ఇప్పుడు మరొక యూరోపియన్ దేశంపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తోందట. ఆ దాడికి ఒక సాకును కూడా చెబుతుంది రష్యా.
వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని రష్యా ప్రభుత్వం ట్రాన్స్‌నిస్ట్రియా ప్రాంతంలో సైనిక చర్యకు కుట్ర పన్నిందని యూరోపియన్ దేశం మోల్డోవా ఆరోపిస్తున్నట్లు అల్ జజీరా నివేదిక పేర్కొంది. రష్యా త్వరలో ముఖ్యమైన చర్య తీసుకోవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
మోల్డోవా గురించి మీరు తెలుసుకోవలసినది ఏంటి అంటే? మోల్డోవా ఐరోపాలోని ఒక చిన్న దేశం. పురాతన కాలంలో, ప్రస్తుత మోల్డోవా రోమన్ సామ్రాజ్యం క్రింద ఉండేది. 1812లో రష్యా తన తూర్పు భాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుని దానికి బెస్సరాబియా అని పేరు పెట్టింది. ఈ వారం, ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న ట్రాన్స్‌నిస్ట్రియా ప్రాంతంలో మోల్డోవా ప్రెసిడెంట్ మైయా సాండు సైనిక చర్యను ప్లాన్ చేస్తున్నట్లు రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది. మంగళవారం సందు అధ్యక్షురాలిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
మోల్డోవాను ఉక్రెయిన్‌కు ఆయుధాల కేంద్రంగా నాటో మారుస్తోందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం సంచలన వాదనలో పేర్కొంది. ఈ ఆరోపణ మాస్కో తన చిన్న పొరుగు దేశంపై సంభావ్య సైనిక చర్యను ప్రారంభించడానికి ఒక సాకు కోసం వెతుకుతున్నదనే ఆందోళనలను మరింత పెంచింది.
ప్రెసిడెంట్ సాండు చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్రియన్ బలుటెల్ రష్యా వాదనలను ఖండించారు. ట్రాన్స్‌నిస్ట్రియాలో సైనికంగా ప్రవేశించే ప్రణాళికలు లేవని పేర్కొన్నారు. అయినప్పటికీ వారు ఈ ప్రాంతాన్ని మోల్డోవాలో భాగమని భావిస్తున్నారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ, ఈ ఆయుధాలు చివరికి ఉక్రెయిన్ కోసం ఉద్దేశించినవని మాస్కో విశ్వసిస్తోంది.
అయితే రష్యా, ఉక్రెయిన్ ల వార్ ఇంకా ముగియకుముందే ఈ వార్త రావడంతో మళ్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోతే ఉక్రెయిన్‌పై రష్యా మాత్రం భారీ దాడి చేసింది. ఉక్రెయిన్ లోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. రష్యా క్షిపణి దాడిలో ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని టాక్. ఈ దాడిలో ఉక్రెయిన్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌కు భారీ నష్టం కూడా జరిగిందట. క్షిపణి దాడితో ప్రజలు మెట్రో స్టేషన్‌లో తలదాచుకున్నారు అని సమాచారం. రష్యా తాము చేసిన దాడిని అంగీకరించిందట. క్రిస్మస్ రోజున ఉక్రెయిన్‌పై దాడి విజయవంతమైందని రష్యా ప్రభుత్వం చెప్పినట్లు BBC వార్త కథనంలో తెలిపింది. ఇక ఈ దాడి విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. రష్యా 70కి పైగా క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు. క్రిస్మస్ రోజున రష్యా ఉద్దేశపూర్వకంగా తమ దేశంపై దాడి చేసిందని పేర్కొన్నారు.