వైసీపీ మహిళా నాయకురాలు, నగరి శాసనసభ్యురాలు రోజాను మంత్రి పదవి ఊరిస్తోంది. ప్రతిసారి దగ్గరదాకా వచ్చి దూరమవుతోంది. దీంతో ఆమె మంత్రి పదవిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎలాగైనా మంత్రి పదవి చేపట్టాలన్నదే ఆమె చిరకాల వాంఛ. దాని కోసమే పార్టీ మారారు. టీడీపీలో సైతం ఆమెకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని వైసీపీలో చేరారు. ఇక్కడ కూడా శిఖండిలు అడ్డు పడడంతో ఆమె మంత్రి పదవి కోరిక నెరవేరడంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఫైర్ బ్రాండ్ గా ..
వైసీపీలో మాటల మాంత్రికురాలిగా పేరున్న రోజాకు ప్రతి సారి మంత్రి పదవి వస్తుందన్న ఆశ తప్ప తీరడం లేదు. వస్తుందనుకున్న పదవి ఊరించడంతో ఎలాగా అని ఆలోచిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాయిస్ తో అదరగొట్టారు. ప్రభుత్వంపై విరుచుకుపడి ఇరకాటంలో పెట్టడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇంత పలుకుబడి సంపాదించుకున్న రోజాకు మంత్రి పదవి ఒక్కటే ప్రతిసారి ఊరిస్తూ అందకుండా పోతోంది.
పట్టుదలతో..
మంత్రి పదవి కోసం ఈసారిపట్టుదలతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. జగన్ సలహాదారులను ఆమె ఇప్పటికే కలిసి తన మంత్రి పదవి కోరికను వెల్లడించినట్లు తెలిసింది. అయినా జగన్ దగ్గర మంచి పేరున్న ఓ మంత్రి రోజాకు మంత్రి పదవి రాకుండా చేయడానికి ప్రయత్నిస్తారని తెలుస్తోంది. మహిళా కోటా రేసులో ఉన్నా ఆమె మంత్రి పదవి ఈసారి కూడా అందివస్తుందా? లేక ఊరిస్తుందా అన్నదే పాయింట్.