ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం నడుస్తోందని తెలుస్తోంది. దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరిన పీకే జగన్ ను గెలుపు గుర్రం ఎక్కించారని చెబుతుంటారు. 2019 ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే జగన్ పీకే సలహాలు తీసుకునే వారని సమాచారం. పాదయాత్ర కూడా పీకే చెప్పిందే అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా పీకే ఊహల్లో నుంచి వచ్చిందే అని తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రకటించిన అమ్మఒడి, నేతన్న నేస్తం, వలంటీర్ వ్యవస్థ, వైఎస్సార్ వాహనమిత్ర తదితర పథకాలు కూడా పీకే సూచించినవే అని తెలుస్తోంది.
సంక్షేమ పథకాల అమలుకు లక్షల కోట్లు ఖర్చవుతున్నాయి. దీంతో ఖజానా లూటీ అయి ఇబ్బందుల్లో పడిపోయింది. పీకే సూచించన వ్యూహాలతో వైసీపీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రభుత్వ నిర్వహణకు వడ్డీలు కడుతూ అప్పులు తేవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో జగన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరో వైపు వలంటీర్ వ్యవస్థతో పార్టీ వైభవం పెరుగుతుందని భావించినా నాయకులు, ప్రజలకు మధ్య ఉండాల్సిన అవినాభావ సంబంధం దెబ్బతింటోందని గుర్తించారు.
జగన్ ప్రభుత్వానికి పథకాల కోసం ఖర్చు చేస్తున్న డబ్బు కోట్లలో ఉండడంతో జగన్ నిధుల కోసం వెంపర్లాడడం జరుగుతోంది. పెద్ద ఎత్తున నిధులు గుమ్మరించడంతో ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిపోయింది. ఉద్యోగుల జీతాలకు సైతం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో జగన్ ప్రభుత్వం ఆలోచనలో పడిపోయింది. పథకాల అమలు భారంగా మారడంతో ఎలా గట్టెక్కడం అని అయోమయంలో పడింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా తమ ద్వారా వచ్చే నిధులు తాము సూచించిన వాటికే ఖర్చు చేయాలని నిబంధన విధించడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మీడియా కూడా జగన్ పై విమర్శలు చేస్తోంది. పీకే సలహాలు పాటించడంతోనే కష్టాలు చుట్టుముడుతున్నాయనే అభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుతం ఆదాయ పెంపుపై జగన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎలాగైనా తమ ప్రభుత్వం గండం నుంచి బయట పడాలని భావిస్తోంది.