AP Politics: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం వెనుక పెద్ద వ్యూహం ఉందా?చంద్రబాబు ఆలోచన మారిందా? ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టనున్నారా? డిసెంబర్ 3 తర్వాత ఏపీలో సైతం రాజకీయాలు మారనున్నాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. రాజకీయ ప్రకంపనల కోసమే తెలంగాణలో టిడిపిని చంద్రబాబు పావుగా పెట్టారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు బిజెపి కి లైన్ క్లియర్ చేసేందుకే చంద్రబాబు తెలంగాణలో టిడిపిని పోటీ నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. అయితే అది కాకుండా వేరే వ్యూహంతో చంద్రబాబు ఉన్నారని తెలుస్తుండడం విశేషం.
ప్రస్తుతం ఏపీలో అధికార వైసిపి, విపక్ష టిడిపి, జనసేనలకు మాత్రమే చోటుంది. జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు అంతంత మాత్రమే. ఇప్పుడున్న వైసీపీలో కాంగ్రెస్ నేతలే అధికం. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నాయకులు అనివార్య పరిస్థితుల్లో జగన్ గూటికి చేరారు. కాంగ్రెస్ అంతటి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేకపోయినా రాజకీయంగా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొందరు కాంగ్రెస్ పార్టీ నాటి గురుతులను గుర్తు చేసుకుంటూ అయిష్టంగానే వైసీపీలో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీతో ఉన్న సైద్దాంతిక విభేదాలతో, స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా వైసీపీలో కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే మాత్రం.. ఏపీలో వైసిపి అసంతృప్త నేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అందుకే ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని బలంగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడే జాతీయస్థాయిలో తనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీబలం పుంజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.సరిగ్గా ఇదే సమయంలో తనను అరెస్టు చేయడం ద్వారా బిజెపి ఒకరకమైన అపవాదుని ఎదుర్కొంటోంది. పరోక్షంగా అది కాంగ్రెస్ పార్టీకి లాబిస్తుంది. ఇటువంటి సమయంలో తెలంగాణలో టిడిపి పోటీ చేస్తే సెటిలర్స్ తో పాటు కమ్మ సామాజిక వర్గం ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే టిడిపి పోటీ చేయకుండా ఉంటే ఆ రెండు వర్గాల ఓట్లు కాంగ్రెస్కు వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ విజయాన్ని తెలంగాణలో ఎవరు ఆపలేరు. బిజెపితో పాటు వీఆర్ఎస్ కు దారుణమైన దెబ్బ తగులుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందితే దాని ప్రభావం ఏపీ పై ఖచ్చితంగా చూపుతోందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు, పూర్వాశ్రమంలో కాంగ్రెస్లో కీలక బాధ్యతలు చేపట్టిన నేతలు ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి చేరితే… వైసిపి మరింత బలహీనమవుతుందని.. అప్పుడు టిడిపి, జనసేన కూటమిఅధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.