
రాజకీయ నేతలలో ఇతరులతో పోల్చి చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి భిన్నమైన నేత. ఆయన పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు నేటికీ యూట్యూబ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు, ఏం మాట్లాడతారో తెలియని నేతగా పవన్ కళ్యాణ్ కు పేరుంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన పవన్ 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆ పార్టీలతో పొత్తు వల్ల జనసేనకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.
ఫలితంగా జనసేన కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. అయితే ఎన్నికల అనంతరం ఏపీలో పార్టీ బలపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చివరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా జనసేన బీజేపీతో కలిసి పని చేస్తుందని వెల్లడించారు. గతంలో చంద్రబాబు పొత్తుల విషయంలో ఏ విధంగా వ్యవహరించారో పవన్ సైతం అదే విధంగా వ్యవహరిస్తున్నారు.
అయితే టీడీపీ బీజేపీతో సన్నిహితంగా మెలగడం కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే జనసేనతో పొత్తుకు మాత్రం బీజేపీ అంగీకరించడం గమనార్హం. తాజాగా జరిగిన అంతర్వేది రథం ఘటన విషయంలో పవన్ సీబీఐకి అప్పగించాలని జగన్ సర్కార్ హయాంలో రాష్ట్రంలోని గుళ్లపై దాడులు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే సమయంలో పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హిందూ నాయకులే మత రాజకీయాలు చేస్తారని… ప్రజలను విడదీసి ఓట్లను పొందాలని హిందూ నేతలు ప్రత్యనిస్తారని… మైనారిటీ నేతలు అలాంటి పనులు చేయరని పవన్ వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ నేతలే నేడు పవన్ తో పొత్తు పెట్టుకోవడం గమనార్హం.