Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham: ముద్రగడ ముసుగు తొలగనుందా?

Mudragada Padmanabham: ముద్రగడ ముసుగు తొలగనుందా?

Mudragada Padmanabham: ముద్రగడ తన ముసుగును తొలగించబోతున్నారా? అధికార వైసీపీలో చేరనున్నారా? ఎన్నికల సమీపిస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తప్పదా? అందుకే వరుసగా మంత్రులతో సమావేశం అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ముద్రగడ పద్మనాభంది కీలక పాత్ర. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. చంద్రబాబుపై కాపుల్లో వ్యతిరేక భావన తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. జగన్ వైపు కాపులు టర్న్ అయ్యేలా వ్యవహరించారన్న అపవాదు ముద్రగడ పై ఉంది. జగన్ అధికారంలోకి రాగానే తాను కాపు ఉద్యమాన్ని వదిలేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి అనుమానాలకు బలం చేకూర్చారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారికంగా వైసీపీలో చేరేందుకు దాదాపు డిసైడ్ అయ్యారు.

గత కొంతకాలంగా ఆయన తన ముసుగును కొద్దికొద్దిగా తీస్తూ వచ్చారు. కిర్లంపూడి లోని ముద్రగడ నివాసం వైసీపీ నేతలతో కిటకిటలాడుతూ వస్తోంది. రాయలసీమకు చెందిన ఎంపీ మిధున్ రెడ్డి తొలుత ముద్రగడతో చర్చలు జరిపారు. తరువాత కాకినాడ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలోని వైసీపీ నేతల బృందం నేరుగా కిర్లంపూడి వచ్చి ముద్రగడతో భేటీ అయ్యారు. ఇటీవల విశాఖలోని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి వద్దకు వెళ్లి ముద్రగడ కీలక మంతనాలు జరిపారు. దీంతో వైసీపీలో చేరడం దాదాపు ఖాయమేనన్న ప్రచారం ఊపందుకుంది.

కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం పై పోరాడుతున్న సమయంలో తనకు వైసీపీ అధినేత జగన్ తో సంబంధమే లేదని ముద్రగడ తేల్చి చెప్పేవారు. అయితే జగన్ కు రాజకీయంగా లబ్ధి చేకూర్చడంలో ముద్రగడ పాత్ర ఉందని తేలింది. దీంతో కాపులు ముద్రగడ వైపు అనుమానపు చూపులు చూడడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఇటీవల ముద్రగడ వైసీపీ నేతలను వెనుకేసుకొచ్చారు. పవన్ ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని విమర్శిస్తే ముద్రగడ తట్టుకోలేకపోయారు. పైగా కాపు ఉద్యమానికి ద్వారపురెడ్డి స్పాన్సర్ గా ఉండేవారని చెప్పి… కాపు సమాజంలో మరింత పలుచనయ్యారు. ముద్రగడకు రాజకీయ అజెండా ఉందని స్పష్టంగా తేలిపోయింది.

ముద్రగడ అధికారికంగా వైసీపీలో చేరడానికి గట్టిగానే సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాకినాడ ఎంపీ స్థానానికి కానీ..తూర్పుగోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి కానీ ముద్రగడ బరిలో దిగే అవకాశం ఉంది. ముద్రగడ చేరికతో దూరమైన కాపు సామాజిక వర్గం దగ్గరవుతుందని వైసీపీ నాయకత్వం ఆశిస్తోంది. అయితే 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్రగడ మూడో స్థానానికి పరిమితమయ్యారు. పిఆర్పి అభ్యర్థి వంగా గీతా చేతిలో ఓడిపోయారు. అటువంటి నాయకుడి చేరిక అంతగా లాభించదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version