https://oktelugu.com/

No-Confidence Motion: అవిశ్వాసం.. ఎన్నిసార్లు ప్రవేశపెట్టారంటే?

1999లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. 269–270 ఓట్ల తేడాతో వాజ్‌పేయి సర్కార్‌ కూలిన విషయం తెలిసిందే. ఇటీవల 2018లో చివరిసారి మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Written By: , Updated On : July 29, 2023 / 12:18 PM IST
No-Confidence Motion

No-Confidence Motion

Follow us on

No-Confidence Motion: ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించినప్పుడు, పాలకపక్షం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు అధికార పక్షాన్ని గద్దె దించేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. అధికార పక్షానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టే హక్కును విపక్షాలకు కల్పించింది. తాజాగా ఈ హక్కును వినియోగించుకోవాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈమేకు ఇటీవల లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకు 27 సార్లు..
లోక్‌సభలో ఇప్పటి వరకు 27 సార్లు లోక్‌సభలో ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తొలిసారి 1963లో అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూపై తీర్మానాన్ని పెట్టారు. అత్యధికంగా ఇందిరా గాంధీపై 15 సార్లు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అన్నిసార్లు ఇందిరాగాంధీ ప్రభుత్వం నెగ్గింది. లాల్‌బహుదూర్‌ శాస్త్రి, పీవీ.నర్సింహారావులపై మూడేసిసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఒక్క ఓటుతో కూలిన వాజ్‌పేయి సర్కార్‌..
1999లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. 269–270 ఓట్ల తేడాతో వాజ్‌పేయి సర్కార్‌ కూలిన విషయం తెలిసిందే. ఇటీవల 2018లో చివరిసారి మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2023లో మళ్లీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ అవిశ్వాసం పెట్టనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు నోటీసులు ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌ మొదట ఇవ్వడంతో దానినే పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఇదిలా ఉంటే తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది రోజులకే అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం గమనార్హం.

ఓడిపోతే అధికారం కోల్పోవాల్సిందే..
మోదీ సర్కార్‌పై రెండు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌ ఎంపీ గగోయ్, బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆ తీర్మానాలకు చెందిన నోటీసులు ఇచ్చారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓడిపోతే అప్పుడు ఆ సర్కార్‌ తన అధికారాన్ని కోల్పోతుంది. తీర్మానంపై చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఆ ఓటింగ్‌లో తీర్మానం పాస్‌ కావాల్సి ఉంటుంది.

అవిశ్వాసానికి స్పీకర్‌ అనుమతి..
లోక్‌సభలోని 198 రూల్‌ ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. సబ్‌రూల్‌ 2, 3 కింద ఆయా పార్టీలకు సమయాన్ని కేటాయిస్తారు. అన్ని పార్టీలతో మాట్లాడి చర్చకు సమయం ప్రకటిస్తామని వెల్లడించారు.