Bandi Sanjay: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీ నాయకత్వ పార్టీలో మార్పులు చేర్పులు వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించింది. దీంతో అసంతృప్తితో ఉన్న సంజయ్ వర్గం.. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల ప్రధాన్ని మోదీ వరంగల్ పర్యటన సందర్భంగా వేదికపై నేతలు చేసిన ప్రసంగాల్లో బండి ప్రసంగమే కార్యకర్తలు, నేతలను ఉత్సాహపరిచింది. తాజాగా కిషన్‌రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలోనూ బండి సంజయ్ తన ప్రసంగం ద్వారా క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్‌రెడ్డిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని సూచించారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం ఆపాలని కోరారు. దీంతో తనను తప్పించడానికి ఫిర్యాదులే కారణమని స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో తనను తప్పించడంపై అసంతృప్తితో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో బండికి కీలక బాధ్యతలు అప్పగించాలని జాతీయ నాయకత్వం ఆలోచన చేసింది.
సంతృప్తి పరిచేలా..
గత కొంతకాలంగా రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చే నిజమైంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను సంతృప్తి పరిచే చర్యలు అధిష్టానం చేపట్టింది. ఈ క్రమంలో బండి సంజయ్ ఇటీవల ఢిల్లీ పర్యటన సమయంలో హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత బండి ఉత్సాహంగా కనిపించారు. దీంతో సంజయ్‌కు కీలక బాధ్యతలు ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. ఆ అంతా ఊహించినట్టుగానే బండి సంజయ్‌ను అధిష్టానం జాతీయ నాయకత్వంలోకి తీసుకుంది.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా..
ఎన్నికల వేళ తెలంగాణ నేతలకు బీజేపీ జాతీయస్థాయిలో గుర్తింపు ఇస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్‌ను జాతీయ నాయకత్వంలోకి తీసుకుంటూ.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
కీలక మార్పులు..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుతోపాటు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇటీవల కేటాయించింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించింది. ఈ క్రమంలో తాజాగా బండి సంజయ్‌కు జాతీయ స్థాయిలో పదవి కేటాయించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించగా.. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఏపీ నేత సత్యకుమార్‌ను నియమిస్తున్నట్టు పేర్కొంది.
మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అసంతృప్తితో ఉన్న బండి సంజయ్‌తోపాటు ఆయన అనుచరవర్గాన్ని సంతృప్తి పరిచే చర్యలో భాగంగా అధిష్టానం కీలక పదవి అప్పగించినట్లు తెలుస్తోంది. మరి దీంతో సంజయ్, ఆయన అనుచరవర్గం మళ్లీ పార్టీకి ఊపు తెస్తారో లేదో చూడాలి.