Nara Lokesh Padayatra: నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారా? లేకుంటే పూర్తిగా నిలిపివేస్తారా? ప్రారంభించాలనుకుంటే ఎప్పుడు ప్రారంభిస్తారు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. లోకేష్ పాదయాత్ర నిలిచిపోయి 55 రోజులు అవుతోంది. చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ తొమ్మిదిన పశ్చిమగోదావరి జిల్లా రాజోలులో పాదయాత్ర నిలిపివేశారు. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చినా పాదయాత్ర పై ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మిగిలిన నాలుగు జిల్లాల్లో పాదయాత్ర పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. అయితే తొలినాళ్లలోనే నందమూరి తారకరత్న అకాల మరణం, అధికార పక్షం అడ్డంకులు తదితర కారణాలతో లోకేష్ ఇబ్బంది పడ్డారు. అయినా సరే ముందుగా పాదయాత్రను కొనసాగించారు. రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో విజయవంతంగానే యాత్ర పూర్తి చేశారు. సరిగ్గా పశ్చిమగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం లో పాదయాత్ర ఉండగా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దీంతో లోకేష్ పాదయాత్రను నిలిపివేసి.. తండ్రి కేసులకు సంబంధించి పర్యవేక్షణకు పరిమితమయ్యారు. ఆ మధ్యన తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారని ప్రకటన చేసినా.. అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చినా పాదయాత్ర విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.
వచ్చే సంక్రాంతి తర్వాత ఏ క్షణంలోనైనా ఏపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడి కానుంది. ఇప్పటికే ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సన్నాహాలు కూడా ప్రారంభించింది. ఇటువంటి తరుణంలో ఎన్నికలకు ఉన్న వ్యవధి తక్కువే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కేవలం అనారోగ్య కారణాలతోనే మధ్యంతర బెయిల్ లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ పని మీదే లోకేష్ నిమగ్నమయ్యారు. ఈనెల 8న చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే ఆయనకు కేసుల నుంచి శాశ్వత విముక్తి లభించినట్టే. అదే కానీ జరిగితే లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తూర్పుగోదావరి,విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర చేపట్టాల్సి ఉంది. ఇంకా వెయ్యి కిలోమీటర్ల మేర నడవాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చూస్తుంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. జనసేనతో సీట్ల సర్దుబాటు, తండ్రి కేసుల పర్యవేక్షణ తదితర కారణాలతో పాదయాత్ర పూర్తిస్థాయిలో పూర్తి చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభించినా.. షెడ్యూల్లో మార్పులు చేస్తారని.. ప్రతి జిల్లాను టచ్ చేస్తూ దూరాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 8 తరువాత లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కావడంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.