
Kanna Lakshminarayana- TDP: సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు సుగమం చేసుకున్నా.. ఆయనతో వచ్చే నాయకులు ఎవరనే అంశంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ముందు జనసేనలో చేరతారని అనుకున్నా అనూహ్యంగా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈయన చేరికతో తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక వర్గం మద్దతు మెండుగా లభిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.
కాపు సామాజిక వర్గంలో బలమైన నేత
ఎంతో అనుభవం ఉన్న కన్యా లక్ష్మీనారాయణకు కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్నారు. కాపు సంఘ సభ్యలతో మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో గణనీయంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసంగా మరల్చుకోవడానికి అన్ని సామాజిక వర్గాల మద్దతు అవసరం. ఇదే విషయంపై కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ కాపులకు న్యాయం చేసింది ముగ్గురేనని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువస్తే, చంద్రబాబు పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపులకు కల్పించారన్నారు. ఇవి అమలయ్యే సమయానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో, జరుగుతుందో అందరికీ తెలిసిందేనని వైసీపీని టార్గెట్ చేశారు.

కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా..
గుంటూరు జిల్లాలో బలమైన కాపు నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ కు దూరంగా జరిగి బీజేపీలో చేరారు. అక్కడ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత ఆయన స్థానంలో వచ్చిన సోము వీర్రాజుతో ఏ మాత్రం పొసగలేదు. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నా.. రాష్ట్రంలో భవిష్యత్తు లేదనే విషయం ఆయనకు అర్థమైంది. కొన్నాళ్ల నుంచి సైలెంట్ గా ఉంటున్న కన్నా, వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. అనూహ్యంగా టీడీపీ పంచన చేరనున్నట్లు ప్రకటించారు. ముందుగా సత్తెనపల్లి సీటు అనుకున్నా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు హామీ టీడీపీ అధిష్ఠానం నుంచి లభించిందని చెబుతున్నారు. మరోవైపు ఆయను ఓడిస్తానని రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.