Jr NTR: చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు చేసిన విమర్శలపై సినీనటుడు నందమూరి తారక రామారావు స్పందించిన తీరుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఆయన మాటలు టీడీపీ నేతలకు సంతృప్తి ఇవ్వలేదు. పార్టీ అధినేతపై వచ్చిన దూషణలపై తమదైన శైలిలో మాట్లాడినా నేతలను లక్ష్యంగా చేసుకోకపోవడంపై సహజంగానే పెదవి విరుస్తున్నారు. ఆయన మాటల్లో నిజాయితీ లేదని చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా బాబుపై వచ్చిన విమర్శలపై రెచ్చిపోయి మాట్లాడతారని భావించినా సాధారణంగానే మాట్లాడి అందరిలో అసహనం పెంచినట్లు తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు ఏడుపు.. వైసీపీ అరాచకంపై జూ.ఎన్టీఆర్ ఘాటు స్పందన

ఎన్టీఆర్(Jr NTR) మాటలపై ఆయన అభిమానులు స్పందించినా టీడీపీ నేతలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాటల్లో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పేరు సైతం ప్రస్తావించకుండా చూసుకోవడంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికంటే ఆయన మాట్లాడకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై ఆరోపణలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా గతంలో ఆయనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు కావడంతో ఎన్టీఆర్ వారి ప్రస్తావన తీసుకురాలేదని తెలుస్తోంది. కానీ వైసీపీని కూడా ఎక్కడ విమర్శించలేదు. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. పార్టీకి మిగిలిన ఏకైక అస్ర్తంగా ఉన్న ఎన్టీఆర్ ఇలా మాట్లాడటంపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు కుటుంబంపై వచ్చిన విమర్శలకు ఎన్టీఆర్ స్పందనపై కర్ర విరగదు పాము చావదు అనే తీరుగా ఉందని పలువురు పెదవి విరిచారు. ఇంత పెద్ద వివాదంపై ఎన్టీఆర్ స్పందన ఇలా ఉంటుందని అనుకోలేదని నాయకులు చెబుతున్నారు. వైసీపీపై ఘాటుగా విమర్శలు చేస్తారని భావించినా కనీసం ఆ పార్టీ పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ వైపు ఉన్నారా? లేరా? అనే సందేహాలు వస్తున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఆయన మాటల్లో నిజాయితీ లేదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
Also Read: మీడియా చానెళ్లను అవమానించిన బాలకృష్ణ