Jr NTR : తెలుగు రాజకీయాల్లో నందమూరి కుటుంబానిది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం ఆ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ పెద్ద దిక్కుగా ఉన్నారు. హరికృష్ణ మరణంతో ఆ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ బాలకృష్ణ చక్కదిద్దుతున్నారు. అయితే కుటుంబంలో విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్,బాలకృష్ణ మధ్య గ్యాప్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మొన్న ఆ మధ్యన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సైతం జూనియర్ గైర్హాజరయ్యారు. దీంతో కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు వెల్లడయ్యింది. అయితే తాజాగా కుటుంబమంతా ఒకే వేదిక మీద కనిపించే అరుదైన అవకాశం ఒకటి వచ్చింది.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆర్బిఐ 100 రూపాయలు నాణాన్ని ఎన్టీఆర్ పేరిట విడుదల చేస్తోంది. కార్యక్రమాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వేడుకగా నిర్వహిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణాన్ని విడుదల చేయనున్నారు.కార్యక్రమానికి చంద్రబాబు, పురందేశ్వరితో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం 100 మందిని ఆహ్వానించారు. ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న మరి కొంతమందికి కూడా ఆహ్వానాలు పంపారు. దీంతో నందమూరి కుటుంబ సభ్యులంతా ఒకే వేదిక పైకి రానున్నారు.
ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా? లేదా? అన్న చర్చ నడుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. దీంతో నాటి కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అని జూనియర్ ఆలోచించారు. హాజరు కాకపోవడమే మంచిది అన్న నిర్ణయానికి వచ్చి.. విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో తారక్ హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
అదే జరిగితే ఈ వేదికకు ప్రత్యేక కళ వచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల కిందటే హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఇంట ఓ వివాహ కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందడి చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణలో కూడా నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఒకే వేదికపైకి రానున్నారని తెలిసి అభిమానులు ఆనంద పడుతున్నారు. అంతా హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.