
YS Jagan : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారా? పార్టీ ఎమ్మెల్యేలకు అల్టిమేటం జారీచేయనున్నారా? పనితీరు బాగాలేని ఎమ్మెల్యేను తప్పిస్తున్నట్టు ప్రకటించనున్నారా? ధిక్కార స్వరాల జాబితాను వెల్లడించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాపు నిర్వహించనున్నారు. గత సమావేశంలో 28 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పిన అధినేత వారికి కొంత సమయం ఇచ్చారు. పనితీరు మార్చుకోకుంటే మార్చేస్తానని హెచ్చరించారు. అయితే అటు తరువాత ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం బయటపడడంతో ఈసారి సూచనలతో సరిపెడతారా? లేకుంటే హెచ్చరికలు జారీచేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
జనవరి 31న కోటంరెడ్డి కలిసిన తరువాత జగన్ అలెర్టయ్యారు. ఓ రకంగా జాగ్రత్తపడ్డారు. తాను చెప్పాల్సినవన్నీ చెప్పానని.. సీఎం తాను అన్నీ చూసుకుంటానని చెప్పారని కోటంరెడ్డి మీడియాకు చెప్పడంతో అంతా లైట్ తీసుకున్నారు. కానీ కోటంరెడ్డి మాత్రం తాను వెళ్లిపోతున్నట్టు సీఎంకు సంకేతాలు ఇచ్చినట్టు తరువాత తెలిసింది. దీంతో జగన్ ఒక్కసారిగా షాక్ కు గురైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి కోటంరెడ్డి అంతలా నిర్ణయం తీసుకుంటారని జగన్ కూడా ఊహించలేదు. ఆనం విషయంలో ఆలోచించినట్టు కోటంరెడ్డి విషయంలో ఆలోచించలేదు. కేవలం అసంతృప్తి, అలక వరకూ భావించారు. కానీ పార్టీకే అల్టిమేట్ ఇస్తారని భావించలేదు. దీంతో జగన్ కూడా అర్థమైంది. అందుకే శరవేగంగా పావులు కదిపారు. అటు ఐ ప్యాక్ టీమ్ తో పాటు సర్వే సంస్థలకు పనిచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్త నేతల వివరాలను తెప్పించుకున్నారు.
గతంలో ఎన్నడూ లేనంత గా పార్టీలో విభేదాలు పెరిగినట్టు సర్వే నివేదికల్లో వెల్లడైంది. ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి గ్యాప్ పెరిగిందని.. పాత,కొత్త గ్రూపులంటూ నేతల మధ్య విభజన రేఖ ఏర్పడిందని ఐ ప్యాక్ సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. 151 స్థానాల్లో సగానికిపైగా నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు చేటు తెస్తాయని నిఘా వర్గాలు సైతం హెచ్చిరికలు జారీచేసినట్టు సమాచారం. దీంతో జగన్ అలెర్టయ్యారు. సోమవారం జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఇదే విషయమై చర్చించనున్నారు. కార్యక్రమ అజెండా కూడా పూర్తిగా మారిపోయింది. కేవలం ధిక్కార స్వరాలు, నేతల మధ్య విభేదాలు వంటి వాటిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సమావేశానికి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ వంటి వారు వస్తారా? రారా? అన్న చర్చ అయితే నడుస్తోంది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను పార్టీకి దూరమైనట్టేనని ప్రకటించారు. అనుమానం ఉన్నచోట ఉండలేనని కూడా ప్రకటించారు. ప్రభుత్వం కల్పించిన గన్ మెన్లను సైతం వెనక్కి పంపారు. అటు ఆనం రామనారాయణరెడ్డిది అదే పరిస్థితి. ఆయన సమావేశానికి హాజరుకావడం అనుమానమే. రెండురోజుల కిందట సీఎం జగన్ ను కలిసిన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ మాత్రం హాజరయ్యే అవకాశం ఉంది.