Balineni Srinivasa Reddy: బిఆర్ఎస్ ఓటమితో జగన్ ఓడిపోతారా? ఆ మాజీ మంత్రి మాటల మర్మం ఏమిటి?

బాలినేనిది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఎమ్మెల్యేగా, మంత్రిగా మూడు దశాబ్దాల పాటు తన ఉనికి చాటుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడే జగన్ వెంట నడిచారు.

Written By: Dharma, Updated On : December 10, 2023 10:39 am

Balineni Srinivasa Reddy

Follow us on

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని జగన్ పై అసంతృప్తిగా ఉన్నారా? ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారా? అందుకే పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలను నిజం చేకూరుస్తున్నాయి. మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఎప్పటికప్పుడు బాలినేని జగన్ సముదాయిస్తూ వచ్చారు. కానీ జగన్ ఇటీవల పట్టించుకోవడం మానేయడంతో బాలినేని తీవ్ర మనస్థాపంతో ఉన్నారు.

తాజాగా వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓడిపోతుందని అర్థం వచ్చేలా మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఊహించానని.. రూ.50 లక్షల పందెం కూడా కాశానని.. అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ వైసిపి గెలుస్తుందని మా అబ్బాయి చెప్పాడని… పందెం గెలిచే అవకాశమున్నా తప్పుకున్నానని.. మాకు జగన్ అంటే అంత ప్రేమ అని.. కానీ అటు నుంచి ఆ స్థాయిలో ప్రేమ ఉండాలి కదా అని ప్రశ్నించారు. అంతర్గతంగా అక్కడ బిఆర్ఎస్ ఓటమి చెందడంతో.. ఇక్కడ జగన్ కూడా ఓడిపోతారని అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలినేనిది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఎమ్మెల్యేగా, మంత్రిగా మూడు దశాబ్దాల పాటు తన ఉనికి చాటుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడే జగన్ వెంట నడిచారు. మంత్రి పదవి వదులుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బాలినేని కి జగన్ అవకాశమిచ్చారు. కానీ విస్తరణలో మంత్రి పదవి నుంచి తొలగించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో తనలో ఉన్న బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో ఏదో ఒక నిర్ణయానికి రావడానికి డిసైడ్ అయ్యారు.

అటు పార్టీలో తన చుట్టూ కుట్ర జరుగుతోందని బాలిలేని అనుమానిస్తున్నారు. తనను పొమ్మన లేక పొగ పెడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించదని ప్రచారం చేస్తున్నారని.. ఒకవేళ టికెట్ దక్కినా ఓడించే ప్రయత్నం జరుగుతోందని బాలినేని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుమారుడు ప్రణీత్ రెడ్డిని రాజకీయాల్లో తీసుకురావాలని తొలుత బాలిలేని భావించారు. అయితే పార్టీలో తనను ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతోందని.. ఇటువంటి సమయంలో కుమారుడిని రాజకీయాల్లోకి తెస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. రాజకీయాల్లో చూస్తే అసహ్యం వేస్తోందని బాలినేని వ్యాఖ్యానించడం విశేషం. ఈసారి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.