ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో జిల్లాకో హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ దీనిపై సమగ్ర కార్యాచరణ ప్రకటించలేదు. వారం రోజుల కిందట పార్లమెంట్ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపనం చేశారు. కానీ వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారో సెలవీయలేదు. తాజాగా మూడు పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రకటించారు.
కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కేసులు తగ్గుతున్నాయని సమీక్షలో తేల్చేశారు. తక్షణమే కర్ఫ్యూ నిబంధనల సమయాన్ని సడలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులుబాటు కల్పించారు. మూడో దశ గురించి చర్చించారు.
పిల్లలకు సోకే వైరస్ వల్ల ఏర్పడే ప్రమాదాన్ని అధికారులు చెప్పడంతో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మూడు ప్రాంతాల్లో మూడు పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మూడింటికి కలిపి దాదాపుగా రూ.40 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు పిల్లలకు సంబంధించిన పు నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ వేయాలని చెప్పారు.
సీఎం జగన్ సమీక్షలో అధికారులకు ఇచ్చే ఆదేశాలు, ఆ తర్వాత మీడియా ద్వారా ప్రచారం కల్పించుకోవడానికి బాగుంటున్నాయి. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా అమలు జరగడం లేదు. రెండేళ్ల కిందట జగన్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికి అమలు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం మూడో దశలోనైనా అధికారులు పనిచేస్తారో లేదో వేచి చూడాల్సిందే.