ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. విజయం కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని దూరం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు బీజేపీతో జత కట్టిన జగన్ ప్రస్తుతం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

రెండున్నరేళ్లుగా జగన్ బీజేపీతో దోస్తీ కడుతూనే ఉన్నారు. ప్రతి విషయంలో బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఏ బిల్లు పెట్టినా దానికి మద్దతు తెలుపుతూ అండగా నిలిచారు. కానీ ఇటీవల ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. దీనికి కారణం ఉందని తెలుస్తోంది. వైసీసీ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఆయన తన పంథా మార్చుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీకి దూరం అవుతున్నారని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రధాని మోడీపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే సర్వేల నేపథ్యంలో జగన్ తన ఉద్దేశం మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైసీపీ బీజేపీకి మద్దతు ఇస్తుందనే అప్రదిష్ట మూటగట్టుకుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఓట్లు రావడం కష్టమయ్యే సూచనలుండడంతో బీజేపీతో పొత్తు కొనసాగించకపోవడమే ప్రధానమనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ముఖ్యమంత్రుల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన జగన్ ఎవరిని కలవకుండానే తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా వ్యూహాత్మకమేనని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో బీజేపీతో పూర్తిస్థాయిలో సహకారం ఇవ్వకుండా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ ముందస్తు ఎన్నికల కోసమే తన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది.