CM Jagan-BJP: ‘25 మంది ఎంపీలను ఇవ్వండి. కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దాం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం’.. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన ప్రకటన ఇది. ఎన్నికల అనంతరం 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించినప్పుడు ఈ ప్రకటనలను బుట్టదాఖలు చేశారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మన అవసరం లేదు. అందువల్ల హోదా ఇవ్వాలని పోరాడలేం. అడుగుతూ ఉండడం తప్ప మరేమీ చేయలేం’అని మడత పేచీ వేశారు. కేంద్రం మెడలు వంచి మరీ హోదా సాధిస్తామని చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే చేతులెత్తేశారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ప్రత్యేక హోదా సహా పలు విభజన హామీలు నెరవేరిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని ప్రధాని మోదీకి జగన్ చెప్పవచ్చు.
షరతులకు లోబడి మద్దతిస్తారా? లేక గతంలోలాగా, బీజేపీ అడగకముందే ‘బేషరతుగా మీకే మా మద్దతు’ అంటారా? అన్నది ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా మారింది. ‘రాష్ట్ర విభజన హామీల అమలుకు మోదీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ ఒత్తిడి తీసుకురావడం లేదు. ప్రధానిని కలిసేది స్వప్రయోజనాల కోసమే. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు’ అనే ఆరోపణల నుంచి బయటపడేందుకు జగన్‌కు మంచి అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలకు తాను కట్టుబడి ఉన్నానని నిరూపించుకునేందుకు.. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా, పోలవరం అంచనాల సవరణ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల, రెవెన్యూ లోటు భర్తీ, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ వంటి హామీలపై కేంద్రాన్ని నిలదీసే ‘చాన్స్’ లభించింది! అది.. రాష్ట్రపతి ఎన్నికల రూపంలో! త్వరలో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అభ్యర్థి విజయం ఈసారి అంత సులువు కాదు. సొంతంగా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన బలం ఎన్‌డీఏకు లేదు. ఎవరైనా సరే.. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా గెలవడం కష్టం.
ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ వెళుతున్నారు. ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను ఆమోదించేటట్లయితే ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతిస్తామని మోదీ ముందు చిట్టా ఉంచితే.. కచ్చితంగా నెరవేర్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈలోగా తమకు అనుకూలురైన ముఖ్యమంత్రులతో మోదీ సమావేశాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రెండ్రోజుల కింద ఒడిసా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ఇంకోవైపు.. దావోస్ పర్యటన నుంచి వచ్చిన జగన్.. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. ఎన్‌డీఏకి వైసీపీ సహకారం తప్పనిసరి కావడంతో వెంటనే మోదీ సరేనన్నారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కూడా జగన్ కలవనున్నారు.
2017లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు తాము ప్రతిపక్షంలో ఉన్నందునే బలమైన డిమాండ్లు కేంద్రం ముందు ఉంచలేకపోయామని వైసీపీ తప్పించుకుంది. ఇప్పుడా అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్ మద్దతు అధికార, ప్రతిపక్షాలకు కీలకంగా మారిందని అంటున్నారు. పార్లమెంటులో ఉభయ సభల సభ్యుల ఎలక్టొరల్ ఓట్లు 5,47,284. ఆ సభల్లో ఎన్‌డీఏకి 57 శాతం ఆధిక్యత ఉంది. కానీ రాష్ట్రాల్లోని శాసనసభా ఎలక్టొరల్ ఓట్లు 5,46,525లో దానికి ఆధిక్యం లేదు. ఎన్‌డీయేతర పక్షాలకు 51 శాతం మెజారిటీ ఉంది. దీంతో.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే దక్షిణ భారతం కీలకంగా మారింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. కేరళలో అధికార లెఫ్ట్ ఫ్రంట్, విపక్ష కాంగ్రెస్ ఏ పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతివ్వవు. తమిళనాట సీఎం స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉంది. అందుచేత ఎన్‌డీఏకి సహకరించే చాన్సు లేదు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్.. బీజేపీపై కత్తులు నూరుతోంది.అందుచేత రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతివ్వడం సందేహమే. ఈ నేపథ్యంలో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మద్దతుకు ప్రాధాన్యం ఏర్పడింది.. కీలకంగానూ మారింది. మన రాష్ట్రంలో వైసీపీకి 151 ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ అభ్యర్థి విజయంలో వైసీపీ మద్దతు కీలకం కానుంది. మరి స్వప్రయోజనాల కోసం జగన్ కేంద్రానికి సాగిలాపడతారో.. లేక రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేసి షరతులు పెడతారో చూడాలి మరీ..
Also Read:Nagababu నాగబాబు శ్రీకాకుళం పర్యటన సక్సెస్.. జనసైనికుల్లో జోష్