
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ర్టాలు అభివృద్ది సాధిస్తాయనే ఉధ్దేశంతో జగన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. రానున్న కాలంలో కేంద్రంలో పనులు చేయించుకోవాలని భావనతో దగ్గరగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను పట్టించుకోకపోయినా జగన్ బీజేపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటన సజావుగానే పూర్తి చేశారు. రాష్ర్ట ప్రయోజనాల కోసం పర్యటన చేశారంటున్న అధికార పార్టీ అందుకు సహజ వనరులను చూపించుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ర్టం అన్ని విధాల అభివృద్ధి చెందలేదని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. అయితే కొన్నేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను భరించాలి. కేంద్రం ఎలాంటి ప్రయోజనాలు రాష్ర్టానికి ఇవ్వకున్నా దానికి అడుగులకు మడుగులొత్తుతారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. జగన్ రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతిస్తున్నారు. కీలకమైన బిల్లుల్లో సపోర్టు చేస్తున్నారు.
జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ప్రత్యేక ప్యాకేజీకే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ కూడా విడుదల కావడం లేదు. రాష్ర్ట ఆర్థిక లోటును కూడా భర్తీ చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు కొర్రీలు ఇక మామూలే. అయితే అవన్నీ భరిస్తూ జగన్ ఎన్నాళ్లు కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
సోనియాను ఎదిరించి ప్రత్యేక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ కు ప్రజల్లో ప్రత్యేక ఇమేజ్ ఉ:ది. కానీ రెండేళ్లుగా బీజేపీత అంటకాగుతున్న వైనాన్ని ప్రజలు చూస్తున్నారు. ఆ ఇమేజ్ క్రమంగా పోతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ర్ట ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై జగన్ గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్ని ఫీట్లు చేసినా చంద్రబాబు తరహాలో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైనా జగన్ బీజేపీ ప్రభుత్వం పట్ల కరకుగా వ్యవహరించాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.