CM Jagan: వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికే ఏపీలో అప్పులఊబిలో కురకపోయిన సంగతి అందరికి తెల్సిందే. దీనికితోడు రెండేళ్లుగా కరోనా పరిస్థితులు నెలకొనడంతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి చేతికి ఎముక లేదన్నట్లుగా సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ సొమ్మును విరివిగా ఖర్చు చేస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులకు నిధుల్లేక ఏపీ ఎదురీత ఈదుతోంది.
ఈక్రమంలోనే 2022 సంవత్సరం జగన్మోహన్ రెడ్డికి ఎలా గడుస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. గడిచిన రెండేళ్లు ఎలాగోలా ప్రభుత్వాన్ని నెట్టికొచ్చిన జగన్మోహన రెడ్డికి ఈ ఏడాది ఎదురీత తప్పదనే టాక్ బలంగా విన్పిస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తోంది. నిధులన్నీ కూడా సంక్షేమ పథకాలు, అధికారుల జీతాలకే సరిపోతున్నాయని తెలుస్తోంది.
ప్రజా సంక్షేమ పథకాల అమలుతో జగన్ ప్రభుత్వానికి భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఏపీలో అభివృద్ధి లేకుండా పోయిందనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఈ పరిస్థితి జగన్ కు ఇబ్బందికరంగా మారుతోంది. దీనికితోడు ప్రాజెక్టుల పనులు నత్తనడక సాగుతున్నాయి. కొత్త కంపెనీలు రాకపోవడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి.
కరోనా దెబ్బకు ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు మూసుకపోయాయి. అప్పులు రోజురోజుకు కొండలా పేరుకపోతున్నాయి. ఉద్యోగుల జీతాలే కాదు రిటైర్ అయినవారి పింఛన్లు సకాలంలో రాని పరిస్థితి నెలకొంది. నిధులకు తిప్పలు ఏర్పడుతుంటంతో నెలనెలా ఇచ్చే సామాజిక పింఛన్లలో ఏరివేత షూరు అయింది. దీంతో సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్లు, తీసుకోని వాళ్లుగా విడిపోతున్నారు.
కొన్ని వర్గాల్లో ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు దారి తీస్తోంది. మద్యం ధరలు ఆకాశాన్ని అంటుకోవడం.. ఇసుక బంగారమై పోవడం, వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోవడం, ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వంటి కారణాలు ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు పెట్టేలా కన్పిస్తున్నాయి. పాలన ఇలా ఉంటే మరోవైపు పార్టీలో లుకలుకలు బహిర్గతమవుతున్నాయి.
జగన్ సీఎం అయ్యాక ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఆయనకు సన్నిహితంగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ సాయిరెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారే అధిష్టానాలుగా మారిపోయాయి. ప్రస్తుత మంత్రివర్గాన్ని మార్చుతామని చెప్పిన జగన్ ఇంతవరకు ఆ ఊసు ఎత్తడం లేదడం లేదు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు నిరాశ చెందుతున్నారు. అలాగే సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నిధుల్లేక అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితులన్నీంటిని సీఎం జగన్మోహన్ రెడ్డి 2022 ఏడాదిలో ఎదుర్కొక తప్పని పరిస్థితి ఉంది.