Chandrababu Delhi Tour: ఏపీలో టీడీపీని మరోసారి అధికారంలోకి తేవడానికి చంద్రబాబు తహతహలాడుతున్నారు. ఇందుకు తన వయసుకు మించి కష్టపడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి తరువాత టీడీపీలో నైరాశ్యం నెలకొంది. అదే సమయంలో అధికార పక్షం నుంచి దాడులు, కేసులు పెరగడంతో టీడీపీ శ్రేణులు ఇళ్లకే పరిమితమయ్యాయి. తరువాత వరుస ఎన్నికల్లో ఓటమితో టీడీపీ పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ చంద్రబాబు తనలో ఉన్న నమ్మకాన్ని పోగుచేసుకుంటూ ప్రభుత్వ వైఖరిపై పోరాడుతూ వచ్చారు. పార్టీని లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అంచెలంచెలుగా శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. టీడీపీలోని నేతలను యాక్టివ్ లోకి తీసుకురాగలిగారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన టీడీపీ మహానాడు ఆయన ప్రయత్నాలకు మరింత ఊపునిచ్చింది. మే 28,29 తేదీల్లో ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు కనీవినీ ఎరుగని జనాలు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ఆంక్షలు విధించినా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం చంద్రబాబులో ఆనందం తొణికిసలాడింది. వచ్చే ఎన్నికల్లో విజయంపై నమ్మకం కుదిరింది. అదే స్పూర్తితో పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అటు మినీ మహానాడు కార్యక్రమాలతో దాదాపు టీడీపీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వచ్చే ఎన్నికలకు సంసిద్ధులను చేయగలిగారు చంద్రబాబు. అదే సమయంలో గత ఎన్నికల్లో బీజేపీ స్నేహాన్ని వదులుకొని కష్టాలు తెచ్చుకున్న విషయాన్ని మరిచిపోలేదు. అందుకే బీజేపీతో చెలిమి కట్టాలని భగీరధ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే అది ఫలించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపయ్యింది.

సానుకూల పరిణామాలు..
ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య మంచి వాతావరణమే ఉంది. ఎన్నికల నాటికి రెండు పార్టీలు కూటమి దిశగా అడుగులేసే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. బీజేపీని కూడా కూటమి వైపు నడిపించాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబుతో ఉన్న గత అనుభవాల నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఇందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిగా బీజేపీ స్నేహం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే పరిస్థితులు ఆయనకు ఇప్పడిప్పుడే అనుకూలిస్తున్నాయి. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అయితే రాజకీయ కారణాలతో ఆయన బదులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు కార్యక్రమానికి పంపించారు. అటు తరువాత ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపది ముర్ముకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు.వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసినా రాష్ట్రపతి అభ్యర్థితో పాటు బీజేపీ నాయకులు చంద్రబాబును కలుసుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ మధ్య ఒక రకమైన సానుకూల వాతవారణం ఏర్పడింది. తాజాగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ దినోత్సవ్ కార్యక్రమాన్ని ఈ నెల 6న నిర్వహిస్తోంది. దీంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు ఆహ్వానం పంపించింది.

ప్రధాని మాట్లాడతారా?
చంద్రబాబు హస్తినా టూర్ కు సర్వం సిద్ధంచేసుకుంటున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఆయన ప్రధాని మోదీతో పాటు బీజేపీ పెద్దలను కలుసుకోనున్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఎన్టీఏలో చేరారు. ప్రధాని మోదీతో సఖ్యతగానే ఉండేవారు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉండేవి. అయితే రాష్ట్ర విభజన హామీలు అమలుచేయడంలో కేంద్రం తాత్సారం చేస్తుండడంతో చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. చివరి సారిగా చంద్రబాబు 2017లో ప్రధాని మోదీని కలుసుకున్నారు. అటు తరువాత వారిద్దరూ కలిసి వేదిక పంచుకున్న సందర్భాలు లేవు. ఎట్టకేలకు ఆజాదీ కా అమృత్ దినోత్సవంలో ఇద్దరు నేతలు కలుసుకోనున్నారు. గతం మాదిరిగా చనువుగా మాట్లాడుకుంటారా? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో కలిసిన ప్రతీసారి టీడీపీ గెలుపొందుతూ వచ్చింది. ఒక్క 2004 ఎన్నికలు మినహా.అందుకే చంద్రబాబు మరోసారి బీజేపీతో చెలిమికి ప్రయత్నిస్తున్నారు.